PM Modi: ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా భారత్‌.. ఇది మామూలు ఘనత కాదు : మోదీ

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద దేశంలోని పేదప్రజల కోసం గడిచిన ఎనిమిదేళ్లలో 3 కోట్ల ఇళ్లు నిర్మించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

Published : 08 Sep 2022 14:55 IST

ఎనిమిదేళ్లలో 3కోట్ల ఇళ్లు నిర్మించామన్న ప్రధాని

దిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (Pradhan Mantri Awas Yojana) కింద దేశంలోని పేదప్రజల కోసం గడిచిన ఎనిమిదేళ్లలో 3 కోట్ల ఇళ్లు నిర్మించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. వీటిలో 10లక్షల ఇళ్లు ఒక్క గుజరాత్‌లోనే ఉన్నాయన్నారు. సూరత్‌ నగరంలో మెగా మెడికల్‌ క్యాంపును వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ.. రాష్ట్రంలో 97శాతం కుటుంబాలకు కుళాయి నీళ్లు అందుతున్నాయన్నారు. ఇక పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM-Kisan) కింద ఇప్పటివరకు రూ.2లక్షల కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో నేరుగా జమచేశామన్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతోన్న భారత్‌.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదగడం మామూలు ఘనత కాదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

‘ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఇటీవలే అవతరించింది. మరిన్ని పెద్ద లక్ష్యాలను సాధించేందుకు మరింత కష్టపడేందుకు ఇది మనకు ఎంతో విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఈ పురోగతి సామాన్యమైనది కాదు. ప్రతి భారతీయుడు గర్వపడే విషయం. ఇదే ఉత్సాహాన్ని మనం కొనసాగించాలి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూరత్‌లో మెగా మెడికల్‌ క్యాంపును ప్రారంభించిన మోదీ.. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు.

ఇదిలాఉంటే, దిల్లీలో రాష్ట్రపతి భవన్‌-ఇండియా గేట్‌ మధ్య ఉండే కర్తవ్య పథ్‌ (రాజ్‌పథ్‌ స్థానంలో కొత్తగా నామకరణం) మార్గాన్ని ప్రధాని మోదీ ఈ సాయంత్రం ప్రారంభించనున్నారు. సెంట్రల్‌ విస్టా పునర్నిర్మాణంలో భాగంగా ఈ ప్రాంతంలో మార్పులు చేసి అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని