Afghanistan: కాబుల్‌లో భారత ఎంబసీ మూసివేత.. అధికారుల తరలింపు

తాలిబన్ల అధీనంలోకి వచ్చిన అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారడంతో ఆ దేశంలో ఉన్న భారత అధికారులను స్వదేశానికి తరలిస్తున్నారు. ప్రస్తుత ఉద్రిక్త

Updated : 17 Aug 2021 10:18 IST

దిల్లీ: తాలిబన్ల అధీనంలోకి వచ్చిన అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారడంతో ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఈ మేరకు భారత్‌ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు.  ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కాబుల్‌లోని భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బంది, భద్రతా విభాగాల అధికారులను తక్షణమే తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బగ్చీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తీసుకొస్తున్నారు. 

120 మందికి పైగా అధికారులు, సిబ్బందితో వాయుసేన సి-17 విమానం కాబుల్‌ నుంచి బయల్దేరింది. ఎంబసీకి చెందిన కీలక పత్రాలను కూడా భద్రంగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి భారత వాయుసేనకు చెందిన భారీ విమానం ఒకటి ఇరాన్‌ గగనతలం నుంచి అఫ్గానిస్థాన్‌కు వెళ్లి మన దేశానికి చెందిన కొందరిని తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. 

మరోవైపు అఫ్గాన్‌లో చిక్కుకున్న భారత పౌరులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరందరినీ సురక్షితమైన ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ నడుమ ఉంచినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో వీరందరినీ భారత్‌కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని