Mercedes cars: విదేశీ నేతల కోసం కొత్త మెర్సిడెస్ కార్లు..

కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు సాయుధ మెర్సిడెస్ కార్లను దిగుమతి చేసుకున్నట్లుగా అధికారిక వర్గాల సమాచారం.   

Published : 08 Jul 2024 17:23 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు సాయుధ మెర్సిడెస్ కార్లను దిగుమతి చేసుకుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ వాహనాలు ఇప్పటికే ముంబయిలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టుకు చేరుకున్నాయని,  భారత్‌ పర్యటనకు వచ్చే విదేశీ నేతల కోసం వీటిని వినియోగించనున్నట్లుగా పేర్కొన్నాయి. ఈ వాహనాల దిగుమతిపై కస్టమ్స్ టాక్స్‌ మినహాయింపు కోసం పరిపాలనా మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖను సంప్రదించినట్లుగా సమాచారం.

ఈ వాహనాలకు కస్టమ్స్ మినహాయింపు ఇవ్వడానికి అధికారులు పలు షరతులు విధించినట్లుగా తెలుస్తోంది. వాటి ప్రకారం కార్లు దిగుమతి చేసుకున్న ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి. ఎటువంటి వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. CBIC అనుమతి లేకుండా ఎవరికీ విక్రయించకూడదు. వాటిని తనిఖీల కోసం కస్టమ్స్ అధికారులకు అందుబాటులో ఉంచాలి.

నాలుగు మెర్సిడెస్ కార్ల విలువ భారతీయ కరెన్సీలో దాదాపు రూ.20 కోట్లు కాగా దిగుమతి సుంకంతో కలిపి రూ.40 కోట్ల ఖర్చు అవుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశానికి వచ్చే విదేశీ నేతలకు ఉపయోగిస్తున్న మెర్సిడెస్ సాయుధ కార్లు పాతవి కావడంతో నూతన వాహనాలను కొనుగోలు చేస్తున్నట్లుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని