Nitin Gadkari: 2024 నాటికి 50% రోడ్డు ప్రమాదాల తగ్గింపు.. లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే: గడ్కరీ

రోడ్లపై సంజ్ఞలు సరిగా ఉండి, ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణతో నిబంధనలు పాటిస్తే దేశంలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాలను (Road Accidents) అరికట్టవచ్చని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. 

Published : 08 Jun 2023 00:10 IST

దిల్లీ: 2024 నాటికి దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను (Road Accidnets) 50 శాతానికి తగ్గించడం కష్టమేనని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, రోడ్డు భద్రత (Road Safety) విషయంలో కొందరి వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల కూడా ఇది సాధ్యం కాదని తెలిపారు. వీధి పోరాటాలు, అల్లర్లు, ఉగ్రదాడుల్లో మరణించే వారికంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారని గడ్కరీ అన్నారు. 

‘‘2024 నాటికి రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గిస్తామని గతంలో ప్రకటించాం. కానీ, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అడ్డంకులు ఉన్నాయి. రోడ్ల నిర్మాణంలో డీపీఆర్ (DPR) రూపొందించేవారు వారి బాధ్యతలను సరిగా నిర్వర్తించడంలేదు. ఖర్చు తగ్గిస్తున్నామని వారు అనుకుంటున్నారు. కానీ, డీపీఆర్‌ రూపొందించే క్రమంలో రోడ్డు భద్రతను పట్టించుకోవడంలేదు. అంతేకాదు, రోడ్డు నిర్మాణంలో రావాల్సిన పైవంతెనలు, కింద వంతెనల నిర్మాణాల వివరాలు డీపీఆర్‌లో చూపించడంలేదు. రోడ్లపై సంజ్ఞలు సరిగా ఉండి, ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణతో నిబంధనలు సరిగా పాటిస్తే.. దేశంలో సగం రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు’’ అని గడ్కరీ తెలిపారు. 

దేశంలో సివిల్‌ ఇంజనీరింగ్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు. రోడ్డు భద్రతకు సంబంధించి ఐదు ఈలు (Es) ముఖ్యమని చెప్పారు. ఇంజినీరింగ్‌ (రోడ్డు నిర్మాణం), ఎమర్జెన్సీ (ప్రమాదం జరిగితే స్పందించడం), ఇంజనీరింగ్‌ (ఆటోమొబైల్‌ వినియోగం), ఎడ్యుకేషన్‌ (రోడ్డు భద్రత గురించి), ఎన్‌ఫోర్స్‌మెంట్ (రోడ్డు నిబంధనలు)లను అమలు చేస్తే మరిన్ని రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. తొమ్మిదేళ్లుగా ఈ విభాగంలో పనిచేస్తున్న తనకు, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇప్పటికి అవగాహన వచ్చిందని అన్నారు. దేశంలో ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరో మూడు లక్షల మంది వికలాంగులుగా మారుతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా మూడు శాతం జీడీపీ కోల్పోతున్నామని గడ్కరీ అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు