S Jaishankar: అసాధారణ స్థితిలో భారత్‌- చైనా బంధం: జై శంకర్‌

న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా, రష్యాతో భారత్‌కున్న సంబంధాలపై విదేశాంగ మంత్రి జై శంకర్(S Jaishankar) స్పందించారు. గల్వాన్‌ ఘర్షణ గురించి మాట్లాడారు. 

Updated : 27 Sep 2023 14:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: 2020లో జరిగిన గల్వాన్‌ ఘర్షణ తర్వాత భారత్‌-చైనా( India-China) మధ్య సంబంధాలు అసాధారణ స్థితిలో ఉన్నాయని విదేశాంగమంత్రి జై శంకర్(S Jaishankar) వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘ప్రపంచంలోని రెండు పెద్దదేశాల మధ్య ఆ స్థాయి ఉద్రిక్తతలు ఉంటే.. వాటి పరిణామాలు ప్రతి ఒక్కరిపై ఉంటాయి. చైనా ఎందుకు అలా ప్రవర్తిస్తుందో ఎప్పుడూ చెప్పదు. అందుకే ఆ ప్రవర్తనకు గల కారణాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. అలాగే ఒకరకమైన అస్పష్టత నెలకొని ఉంటుంది. గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించిన దేశంతో ఏమీ జరగనట్టుగా ఉండటం చాలా కష్టం. గత మూడేళ్ల కాలాన్ని గమనిస్తే.. ఆ సంబంధాలు ఆసాధారణ స్థితిలో ఉన్నాయి. రాకపోకలు జరగడం లేదు. ఈ స్థాయి సైనిక ఉద్రిక్తతలు.. భారత్‌లో చైనాపై ఉన్న అభిప్రాయాన్ని ప్రభావితం చేసింది’ అని న్యూయార్క్‌లోని కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌లో భాగంగా అడిగిన ప్రశ్నకు మంత్రి(S Jaishankar) సమాధానమిచ్చారు. 

స్థిరంగా రష్యాతో సంబంధాలు..

రష్యా(Russia)తో భారత్‌ సంబంధాలు చాలా స్థిరంగా ఉన్నాయని జై శంకర్(S Jaishankar) అన్నారు. ఈ సంబంధాలు అదే స్థాయిలో కొనసాగడానికి తాము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలుపెట్టిన దగ్గరి నుంచి పాశ్చాత్య దేశాలతో రష్యా సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.

ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు..: కెనడా వివాదంపై జైశంకర్‌ ఘాటు రిప్లై

దీనిని ఉద్దేశించి మాట్లాడుతూ..‘ఇతర దేశాలతో సంబంధాలు పెంపొందించుకోవడానికి రష్యా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆసియా దేశాల వైపు చూస్తోంది. రష్యా తనను ఐరోపా దేశంగా పరిగణించుకుంటున్నప్పటికీ.. అది ఆసియా పవర్‌ కూడా. అలాగే రష్యా-చైనా సంబంధాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని నాకు తెలుసు. అయితే 1950ల నాటి నుంచి రష్యాతో భారత్‌ బంధం స్థిరంగా ఉందని చెప్పగలను. యూఎస్‌-రష్యా, రష్యా-చైనా, ఐరోపా-రష్యా మధ్య సంబంధాల్లో ఒడుదొడుకులు వచ్చాయి. కానీ భారత్‌తో బంధం మాత్రం చాలా చాలా స్థిరంగా ఉంది’ అని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని