ఉద్రిక్తతలు ఇలా తగ్గించుకుందాం!

భారత్‌-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికే దిశగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు ఐదు అంశాలతో కూడిన ప్రణాళికను ఖరారు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఉభయ వర్గాలకు మంచిదికాదని చైనా సైతం అంగీకరించింది............

Updated : 11 Sep 2020 08:44 IST

ప్రస్తుత పరిస్థితులు ఉభయులకూ మంచిదికాదని వ్యాఖ్య
మాస్కో వేదికగా చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్‌ చర్చలు

మాస్కో: భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అడుగు పడింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఉభయులకూ మంచిది కాదని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఘర్షణలు మరింత ముదిరితే పరిస్థితులు ప్రమాదకర స్థాయికి చేరే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో శాంతి నెలకొల్పి యథాతథ స్థితికి చేరుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐదు అంశాలతో కూడిన ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు. మాస్కో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో మన విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సమావేశమయ్యారు. తక్షణమే బలగాల ఉపసంహరణను ప్రారంభించాలని నిర్ణయించారు. సుమారు నాలుగు నెలలుగా తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

భేటీలో ఖరారైన ఐదు అంశాల ప్రణాళిక..

* విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాలి. ఇరు దేశాధినేతలు పలు భేటీల్లో నిర్ణయించిన అంశాలను మార్గదర్శకంగా తీసుకొని ముందుకు సాగాలి. 
* ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు ఉభయులకూ మంచిదికాదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దు దళాలు చర్చలు కొనసాగించాలి. వెంటనే సైనిక ఉపసంహరణ చేపట్టాలి. ఎల్‌ఏసీ వద్ద సమాన దూరం పాటించాలి. తద్వారా ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేయాలి. 
* ఇప్పటి వరకు సరిహద్దుల విషయంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అన్ని ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌కు కట్టుబడి ఉండాలి. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలి. ఉద్రిక్తతలు పెంచే ఎలాంటి చర్యలకు పాల్పడొద్దు. 
* సరిహద్దు వివాదాల్ని ప్రత్యేక ప్రతినిధుల బృందం యంత్రాంగం ద్వారా పరిష్కరించుకునేందుకు చర్చలు జరపాలి. ఆ దిశగా ఇప్పటికే ఏర్పడ్డ ‘వర్కింగ్‌ మెకానిజం ఫర్‌ కన్సల్టేషన్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ ఆన్‌ ఇండియా-చైనా బార్డర్‌ అఫైర్స్’‌(డబ్ల్యూఎంసీసీ) కమిటీ సమావేశాలు కొనసాగించాలి. 
* ఉద్రిక్తతలు తగ్గిన వెంటనే ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే దిశగా నిర్మాణాత్మక చర్యల్ని వేగవంతం చేయాలి.
ఈ ఐదు అంశాల్ని పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా సరిహద్దుల్లో శాంతి, ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని నిర్ణయించారు. అయితే, గతంలో అనేక సార్లు కుదిరిన ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డ చరిత్ర చైనాకు ఉంది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందాన్ని ఏ మేరకు కట్టుబడి ఉంటుందో చూడాల్సి ఉంది. గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరు దేశాల సైనికాధికారులు చర్చలు జరిపారు. వెంటనే బలగాల్ని ఉపసంహరించి యాథాతథ స్థితికి రావాలని నిర్ణయించారు. కానీ, చైనా వాటిని భేఖాతరు చేసింది. పదే పదే ఎల్‌ఏసీ వెంట అతిక్రమణకు పాల్పడుతూ భారత్‌ను కవ్వించేందుకు ప్రయత్నించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు