కలవరపెడుతోన్న కరోనా మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వరసగా రెండో రోజు 50వేలపైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Updated : 31 Mar 2021 10:45 IST

53,480 కొత్త కేసులు..354 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వరసగా రెండో రోజు 50వేలపైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం 10,22,915 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహింగా..53,480 కొత్త కేసులు బయటపడ్డాయి. అయితే క్రితం రోజుతో పోల్చితే కొద్దిమేర తగ్గుదల (4.8 శాతం తక్కువ)కనిపించింది. కేసులతో పాటు మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 354 మంది కొవిడ్ కారణంగా మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తంగా 1,21,49,335 మంది కరోనా బారిన పడగా..1,62,468 మంది ప్రాణాలు వదిలారు. 

ఇక, నిన్న ఒక్కరోజే 41,280 మంది కరోనా నుంచి కోలుకోవడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం 1,14,34,301(94.11శాతం) మంది మహమ్మారిని జయించగా..5,52,566 (4.55శాతం) మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌లోనే క్రియాశీల కేసుల వాటా అధికంగా ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

మహారాష్ట్రలో పెరిగిన కొవిడ్ మృతులు:
కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కొవిడ్ కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ..తాజాగా మరణాలు మాత్రం భారీగా నమోదయ్యాయి. నిన్న 27,918 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలగా..139 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 23,820 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 5.52లక్షల క్రియాశీల కేసులుండగా..ఒక్క ఈ రాష్ట్రంలోనే 3.42 లక్షల మంది వైరస్‌తో బాధపడుతున్నారు. మొత్తంగా 27,73,436 మందికి కరోనా సోకగా..23లక్షల పైచిలుకు మంది కోలుకున్నారు. 

మరోవైపు, దేశంలో కరోనా టీకా కార్యక్రమంలో ఆశించినంత వేగం కనిపించడం లేదు. ఆదివారం, హోలీ సెలవులు కూడా దీనిపై ప్రభావం చూపాయి. మార్చి 30న 19,40,999 మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది. ఇప్పటివరకు 6,30,54,353 టీకా డోసులను అందించింది. ఇక, ఇప్పటివరకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలనే ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్రమంలో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాకు త్వరలో అనుమతులు లభించే అవకాశం కనిపిస్తోంది. భారత్‌లో ఈ టీకా పంపిణీ నిమిత్తం రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల టీకా ట్రయల్స్ మధ్యంతర ఫలితాల్ని భారత ఔషధ నియంత్రణ సంస్థకు రెడ్డీస్ అందజేసిన నేపథ్యంలో..వాటిని పరిశీలించేందుకు కేంద్ర నిపుణుల బృందం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని