కరోనా: ఒక్కరోజే 780 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి పగ్గాలు లేకుండా విస్తరిస్తోంది. వందల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటోంది.

Updated : 09 Apr 2021 11:47 IST

1,31,968 మందికి కొవిడ్ పాజిటివ్‌

ఏడు శాతం దాటిన క్రియాశీల రేటు

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పగ్గాలు లేకుండా విస్తరిస్తోంది. వందల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటోంది. తాజాగా ఈ వైరస్ ధాటికి 780మంది మృత్యుఒడికి చేరుకున్నారు. కరోనా రెండోదశలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దాదాపు ఆరు రోజుల క్రితం 714 మరణాలు సంభవించాయి. తాజాగా రికార్డు స్థాయిలో 1,31,968 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 30 లక్షల మార్కును దాటగా..1,67,642 మంది ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వైరస్ ఉద్ధృతి కారణంగా..రోజురోజుకు కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 9,79,608 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 7.04 శాతానికి చేరింది. మరోవైపు నిన్న ఒక్కరోజే 61,899 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 1,19,13,292 మంది కోలుకోగా..రికవరీ రేటు 91.67 శాతానికి పడిపోయింది.

ఇక మహారాష్ట్రలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాల్లో దాదాపు సగం ఇక్కడి నుంచే ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 56 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. 376 మరణాలు చోటుచేసుకున్నాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. ఏప్రిల్ 8 వరకు 9,43,34,262 మందికి టీకా డోసులు వేశారు. నిన్న 36,91,511 మందికి టీకాలు అందాయి. గురువారం ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ..ఈ నెల 11 నుంచి 14 తేదీల మధ్య టీకా ఉత్సవం నిర్వహించి, అర్హులందరికీ టీకాలు అందించాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని