కరోనా: 2.34లక్షల కేసులు.. 1341 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. వరుసగా మూడో రోజు దేశవ్యాప్త కొవిడ్‌ కేసులు రెండు లక్షలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 14.95లక్షల టెస్టులు చేయగా 2,34,692 కేసులు నమోదయ్యాయి.

Updated : 17 Apr 2021 11:12 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. వరుసగా మూడో రోజు కొవిడ్‌ కేసులు రెండు లక్షలకు పైనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 14.95లక్షల టెస్టులు చేయగా 2,34,692 కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరింది. కొత్తగా 1,23,354 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,26,71,220 చేరి.. రికవరీ రేటు 87.80 శాతంగా ఉంది.

ఇక రెండో దశలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రోజుకు వెయ్యి మందికి పైనే కరోనాకు బలవుతున్నారు. తాజాగా 1,341 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ఒక రోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకుముందు కొవిడ్‌ తొలి దశలో గతేడాది సెప్టెంబరులో ఒకరోజులో అత్యధికంగా 1200 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,75,649కు చేరింది. ఇక మరణాల రేటు 1.22శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 16,79,740 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో టీకా ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. నిన్న మొత్తం 30.04 లక్షల మందికి పైగా టీకాలు వేయగా.. మొత్తం టీకాలు పొందిన వారి సంఖ్య 11.99కోట్లు దాటింది. 

మహారాష్ట్ర, దిల్లీలో ఆందోళకర పరిస్థితి
మహారాష్ట్రలో కేసుల విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 61,695 కేసులు నమోదు కాగా.. 349 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దిల్లీలో 16,699 కేసులు నమోదు కాగా, 112 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, దిల్లీ సహా దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మృతుల సంఖ్య పెరిగి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడటంతో.. ఆక్సిజన్‌ లభ్యతపై నిన్న ప్రధాని మోదీ అధికారులతో సమీక్షించారు. డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ఉత్పత్తిని పెంచాలని ఆయన సూచించారు. నిరంతర ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు 24 గంటలూ ట్యాంకర్లను నడపాలని ఇందుకోసం డ్రైవర్లు షిప్టుల వారీగా పనిచేసేలా మార్పులు చేయాలని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని