India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. దేశంలో వరుసగా ఐదో రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 13.56 లక్షల పరీక్షలు చేయగా..

Updated : 19 Apr 2021 09:49 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. 3 లక్షలకు చేరువగా రోజువారీ కేసులు నమోదవడం వైరస్‌ తీవ్రతకు అద్దంపడుతోంది. గడిచిన 24గంటల్లో 13.56 లక్షల పరీక్షలు చేయగా.. 2,73,810 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో దేశంలో వరుసగా ఐదో రోజూ రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఇక మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. కొత్తగా 1,44,178మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821కు చేరి.. రికవరీ రేటు 86.62శాతానికి తగ్గింది. 

ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 1,501 నమోదు కాగా.. ఆదివారం ఆ సంఖ్య ఇంకా పెరిగింది. మొత్తం 1,619మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,78,769కి చేరింది. ఇక మరణాల రేటు 1.20 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  19,29,329 కి పెరిగింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 12.30లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 12,38,52,566కి చేరింది. 

ప్రమాదకరంగానే మహారాష్ట్ర
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ పరిస్థితులు ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 68,631 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 503మరణాలు నమోదయ్యాయి. దేశరాజధాని దిల్లీలో 25,462 కేసులు నమోదు కాగా, 161 మంది మహమ్మారి ధాటికి బలయ్యారు. కాగా దేశంలో వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమైన నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని