India Corona : వైరస్‌ను జయించిన 2 కోట్ల మంది

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దాంతో వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

Updated : 14 May 2021 12:18 IST

3.43 లక్షల కొత్త కేసులు..4,000 మరణాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మరోవైపు వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నాలుగు లక్షల మార్కును దాటిన కేసులు..ఐదు రోజులుగా ఆ మార్కుకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.43లక్షల మందికి కరోనా సోకింది. ఇక మరణాల సంఖ్య నాలుగువేలుగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటితో పోల్చితే కేసులు, మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. 

తాజాగా 18,75,515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,43,144 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. క్రితం రోజు(3,62,727)తో పోల్చుకుంటే కొత్త కేసులు కాస్త తగ్గాయి. దాంతో ఇప్పటివరకు రెండు కోట్ల 40లక్షల మందికి ఈ మహమ్మారి సోకగా.. రెండు కోట్ల మందికి పైగా దాన్నుంచి బయటపడ్డారు. నిన్న 3,44,776 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,00,79,599గా ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం రికవరీ రేటు 83.50 శాతంగా ఉంది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,04,893 మంది కరోనాతో బాధపడుతన్నారు. క్రియాశీల రేటు 15.41 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు, నిన్న 4,000 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తంగా 2,62,317 మంది ఈ వైరస్‌కు బలయ్యారు. 

మరోవైపు, కరోనా టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మరిన్ని కొత్త టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. నిన్న 20,27,160 మందికి టీకాలు అందించింది. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 18 కోట్లకు చేరువైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని