Corona: 3 లక్షల దిగువకు కొత్త కేసులు

దేశంలో కరోనా సృష్టిస్తోన్న విలయం భారీ సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది. మరోరోజు నాలుగు వేలమందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది.

Updated : 17 May 2021 15:25 IST

4 వేలకుపైగానే మరణాలు..

దిల్లీ: దేశంలో కరోనా సృష్టిస్తోన్న విలయం భారీ సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది. తాజాగా నమోదవుతున్న కేసులు రోజురోజుకు తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య భారీగానే ఉంటోంది. గడిచిన 24 గంటల్లో  నాలుగు వేలమందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. ఇక వరుసగా నాలుగో రోజు కొత్త కేసులు తగ్గాయి. 3 లక్షల దిగువన నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది.  

ఆదివారం 15,73,515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,81,386 మందికి పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్‌ 20న 2.95లక్షల మందికి కరోనా నిర్ధారణ కాగా..ఈ తర్వాత 3 లక్షలకు దిగువన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. నిన్న ఒక్కరోజే 4,106 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసులు సంఖ్య 2.49 కోట్లకు చేరగా.. ఇప్పటివరకు 2,74,390 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.

వరసగా నాలుగో రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గడంతో దాని ప్రభావం క్రియాశీల కేసుల్లో కనిపించింది. ప్రస్తుతం 35,16,997 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 3,78,741 మంది మహమ్మారి నుంచి కోలుకోవడం గమనార్హం. కొత్త కేసుల కంటే రికవరీలు భారీగా పెరిగాయి. మొత్తంగా 2,11,74,076 మంది వైరస్‌ను జయించారు. అయితే నిన్న నిర్ధారణ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా పాజిటివ్ కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. 

మరోవైపు, దేశంలో నిర్వహిస్తోన్న కరోనా టీకా కార్యక్రమంలో ఆశించిన వేగం కనిపించడంలేదు. ఆదివారం కేవలం 6,91,211 మందికి మాత్రమే టీకాలు అందించారు. మొత్తంగా ప్రభుత్వం 18.29 కోట్ల డోసులను పంపిణీ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని