IndiaCorona: ఉద్ధృతంగా మహమ్మారి వ్యాప్తి.. లక్షన్నరకు చేరువైన కొత్త కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే కొత్త కేసులు లక్ష దాటగా.. తాజాగా ఆ సంఖ్య 1.41 లక్షలకు చేరింది. ముందురోజు కంటే 21 శాతం అదనంగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 3 వేల పైనే ఉన్నాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. 

Updated : 08 Jan 2022 13:03 IST

ఐదు లక్షలకు చేరువగా క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చింది. వరుసగా రెండో రోజూ కొత్త కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21 శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 3 వేల పైనే ఉన్నాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.

నిన్న 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 1,41,986 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతానికి పెరిగి ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్‌, దిల్లీ, కర్ణాటక, తమిళనాడులో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ఒక్క మహారాష్ట్రలో 40 వేల కేసులు నమోదు కాగా.. అందులో ముంబయిలో వెలుగుచూసిన కేసుల సంఖ్యే 20,971గా ఉంది. పశ్చిమ్‌ బెంగాల్‌లో 18 వేలు, దిల్లీలో 17 వేల కేసులు బయటపడ్డాయి. మిజోరంలో పాజిటివిటీ రేటు 15 శాతానికి చేరింది.

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 3,071గా ఉన్నాయి. అందులో 1,203 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. 27 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాతాలకు ఈ వేరియంట్ విస్తరించిందని కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 876 మంది దీని బారిన పడగా..దిల్లీలో ఆ సంఖ్య 513కి చేరింది. 

ఐదు లక్షలకు చేరువైన క్రియాశీల కేసులు..
దేశంలో క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్త కేసుల ఆకస్మిక పెరుగుదలతో అవి ఐదు లక్షలకు సమీపించాయి. ప్రస్తుతం 4,72,169 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.34 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 97.30 శాతానికి తగ్గింది. నిన్న 40,895 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3.44 కోట్లు దాటింది. 24 గంటల వ్యవధిలో 285 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 4.8 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. అయితే నమోదు కాని మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌ నాటికే దేశంలో దాదాపు 32లక్షల కొవిడ్‌ మరణాలు సంభవించి ఉండొచ్చని తాజా అధ్యయనం ఒకటి అంచనా వేసింది.

150 కోట్ల డోసుల మైలురాయి..

దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. నిన్న 90 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకూ 150 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే జనవరి మూడు నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి టీకా అందిస్తోన్న సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని