India Corona: అదే ఉద్ధృతి.. కొత్తగా 2.64 లక్షల కేసులు

దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. తాజాగా 2,64,202 మందికి కరోనా సోకింది. ముందురోజు కంటే 6.7 శాతం అదనంగా కేసులు వెలుగుచూశాయి.

Updated : 14 Jan 2022 10:31 IST

12 లక్షలు దాటిన క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. తాజాగా 2,64,202 మందికి కరోనా సోకింది. ముందురోజు కంటే 6.7 శాతం అదనంగా కేసులు వెలుగుచూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి చేరింది. నిన్న 17 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో మహమ్మారి విజృంభణకు దోహదం చేస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు 5,753కి పెరిగాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీ, కేరళలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 12 లక్షలు దాటాయి. క్రియాశీల కేసుల రేటు 3.48 శాతానికి ఎగబాకింది. నిన్న లక్ష మందికిపైగా కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 3.65 కోట్ల మందికి వైరస్ సోకగా.. అందులో 3.48 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 95.20శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 315 మంది వైరస్‌ కారణంగా మరణించారు. మొత్తంగా 4.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

టీకా మొదటి డోసు తీసుకున్న 42 శాతం టీనేజర్లు..

దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. నిన్న 73 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో రెండోడోసు వ్యాక్సినేషన్‌ 70శాతం పూర్తయిందని నిన్న ప్రధాని వివరించారు. మొత్తంగా 155 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 15 నుంచి 18 మధ్య వయస్సు వారికి 3.14 కోట్ల డోసులు అందాయి. ఆ వయస్సు వారిలో 42 శాతం మందికి తొలి డోసు టీకా అందినట్లైంది. అలాగే 33,63,635 మంది ప్రికాషనరీ డోసు తీసుకున్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని