India Corona: అంతకంతకూ పెరుగుతున్న మహమ్మారి ఉద్ధృతి.. కొత్త కేసులెన్నంటే..?

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. క్రితం రోజు మూడు లక్షలు దాటిన కొత్త కేసులు.. తాజాగా 3,47,254కి పెరిగాయి.

Updated : 21 Jan 2022 14:46 IST

20 లక్షలు దాటిన క్రియాశీల కేసులు 

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. క్రితం రోజు మూడు లక్షలు దాటిన కొత్త కేసులు.. తాజాగా 3,47,254కు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 19 లక్షల మందికి పైగా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. పాజిటివిటీ రేటు 17.94 శాతానికి ఎగబాకింది. కేసుల పరంగా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 1.40 లక్షల కేసులు నమోదవడం గమనార్హం. ఇక, దేశంలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 9,692కు చేరింది. 

అటు మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. నిన్న 703 మరణాలు నమోదయ్యాయి. కేరళ కొంతకాలంగా మునుపటి లెక్కల్ని సవరిస్తుండటంతో ఆ ప్రభావం మృతుల సంఖ్యపై పడింది. భారత్‌లో ఈ రెండేళ్ల వ్యవధిలో 3.85 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,88,396 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో క్రియాశీల కేసులు 20,18,825కి చేరాయి. క్రియాశీల రేటు 5.23 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 2,51,777 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.6 కోట్లుగా ఉన్నాయి. రికవరీ రేటు 93.50 శాతానికి పడిపోయింది. 

160 కోట్లకు పైగా డోసుల పంపిణీ..

ఇక నిన్న 70 లక్షల మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 160 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారికి 3.9 కోట్ల డోసులు అందగా.. 68,61,926 ప్రికాషనరీ డోసుల పంపిణీ జరిగింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని