India Corona: రెండు లక్షలకు తగ్గిన కొత్త కేసులు.. 950కి చేరిన మరణాలు

దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గత కొద్దికాలంగా మూడు లక్షల లోపు నమోదవుతోన్న కేసులు తాజాగా రెండు లక్షలకు దిగొచ్చాయి.

Published : 31 Jan 2022 09:56 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గత కొద్దికాలంగా మూడు లక్షల లోపు నమోదవుతోన్న కేసులు తాజాగా రెండు లక్షలకు దిగొచ్చాయి. అయితే పాజిటివిటీ రేటు మాత్రం14.5 శాతం నుంచి 15.77 శాతానికి పెరిగింది. ఆదివారం నిర్ధారణ పరీక్షలు సంఖ్య తగ్గడమే.. కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. మరోపక్క మరణాలు 950 దాటాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

ఆదివారం 13 లక్షల మందికి కరోనా నిర్ధరాణ పరీక్షలు చేయగా.. 2,09,918 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. 24 గంటల వ్యవధిలో 959 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు ఆ సంఖ్య 893గా ఉంది. ఒక్క కేరళలోనే 51 వేల కేసులు.. 475 మరణాలు సంభవించాయి. ప్రభుత్వం వెల్లడించే గణాంకాలపై కేరళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రాష్ట్రం మునుపటి లెక్కలను కలపడంతో మృతుల సంఖ్య భారీగా ఉంది. కర్ణాటకలో 68, మహారాష్ట్రలో 50 మంది మరణించారు. ఇప్పటివరకూ  నాలుగు కోట్ల 13 లక్షల మందికి కరోనా సోకగా.. 4,95,050 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

ఇక నిన్న 2,62,628 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 3.89 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.  క్రియాశీల కేసులు 18,31,268కి తగ్గాయి. క్రియాశీల రేటు 4.43 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 94.37 శాతానికి చేరింది. 

మరోపక్క ఆదివారం సెలవు రోజు కావడంతో కేవలం 28 లక్షల మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. అర్హులైన జనాభాలో 75 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటివరకూ 166 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు