India Corona: 22 వేల కేసులు.. 60 వేల రికవరీలు..

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ముందురోజు 25 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు.. తాజాగా 22,270కి పడిపోయాయి.

Published : 19 Feb 2022 09:56 IST

175 కోట్ల టీకా డోసుల పంపిణీ

దిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ముందురోజు 25 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు.. తాజాగా 22,270కి పడిపోయాయి. శుక్రవారం 12 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. దాంతో పాజిటివిటీ రేటు రెండు శాతం(1.8 శాతం) దిగువకు చేరి ఊరటనిస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. 

కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 2.5 లక్షలకు తగ్గాయి. ఆ కేసుల రేటు 0.59 శాతానికి క్షీణించింది. నిన్న ఒక్కరోజే 60 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 4.28 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.20 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.12 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు కంటే మరణాల సంఖ్య(492)లో తగ్గుదల కనిపించింది. మొత్తంగా 5,11,230 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 

175 కోట్ల డోసుల పంపిణీ...

గత ఏడాది జనవరి నుంచి దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. అప్పటినుంచి 175 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. అలాగే దేశంలో 80 శాతం మంది వయోజనులు రెండు డోసుల టీకా తీసుకున్నారని, 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా దేశం పయనిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి నిన్న హర్షం వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం 36 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని