India Corona: దేశంలో 3,805 కొత్త కేసులు.. దిల్లీలో 21 శాతం పెరిగిన పాజిటివ్‌ల సంఖ్య

దేశంలో కరోనావ్యాప్తి కొనసాగుతోంది. మరోరోజు మూడు వేలకుపైగా కొత్త కేసులొచ్చాయి. దిల్లీలో మూడు నెలల తర్వాత అత్యధిక కేసులు రాగా.. ముంబయిలో వరుసగా నాలుగో రోజు 100 మందికి పైగా వైరస్ బారినపడ్డారు.

Published : 07 May 2022 10:08 IST

20 వేల మార్కు దాటిన క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనావ్యాప్తి కొనసాగుతోంది. మరోరోజు మూడు వేలకుపైగా కొత్త కేసులొచ్చాయి. దిల్లీలో మూడు నెలల తర్వాత అత్యధిక కేసులు రాగా.. ముంబయిలో వరుసగా నాలుగో రోజు 100 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

24 గంటల వ్యవధిలో 3,805 మందికి కరోనా సోకగా.. 22 మరణాలు సంభవించాయి. 4.8 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. నిన్న దిల్లీలో 1,656 మందికి కరోనా సోకింది. ముందురోజు కంటే 21 శాతం అధికంగా కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ పాజిటివిటీ రేటు 5.39 శాతానికి చేరింది. మహారాష్ట్రలో వరుసగా రెండోరోజు 200 పైగా కేసులొచ్చాయి. అందులో ముంబయి వాటానే 100కుపైగా ఉంది. కేరళలో 400 కేసులు నమోదు కాగా.. 20 మరణాలు నమోదయ్యాయి. 

నిన్న 3,168 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. మరోపక్క క్రియాశీల కేసులు 20 వేల మార్కు దాటడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కేసుల్లో బాధితుల సంఖ్య 0.05 శాతంగా కొనసాగుతోంది.

190 కోట్ల టీకా డోసుల పంపిణీ...

కరోనా కట్టడికి కేంద్రం గత ఏడాది ప్రారంభం నుంచి టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దాని కింద ఇప్పటివరకూ 190 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 17.49 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ప్రస్తుతం 12 ఏళ్లు దాటిన వారందరికీ టీకా పంపిణీ జరుగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారు ప్రికాషనరీ డోసు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని