200కు చేరువలో కరోనా మరణాలు!

భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, క్రియాశీల కేసులు, మరణాల సంఖ్యలోనూ పెరుగుదల కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 21 Mar 2021 10:59 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, క్రియాశీల కేసులు, మరణాల సంఖ్యలోనూ పెరుగుదల కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 11.33లక్షల పరీక్షలు చేయగా.. 43,846 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130కి చేరింది. కొత్తగా 22,956 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,11,30,288కు చేరి.. రికవరీ రేటు 96.12శాతానికి తగ్గింది. ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 188 నమోదు కాగా.. శనివారం రికార్డు స్థాయిలో 197 మంది మరణించారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,59,755కి చేరింది. ఇక మరణాల రేటు 1.38 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  3,09,087 కి పెరిగింది. ఇక మహారాష్ట్రను కరోనా విణికిస్తోంది. నిన్న ఒక్కరోజు అక్కడ 27వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికిపైగా ఈ రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఇక్కడ ఎక్కవుగానే చోటుచేసుకుంటున్నాయి.

ఒకేరోజు 25లక్షల మందికి వ్యాక్సిన్‌ 
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగానే సాగుతోంది. గడిచిన 24గంటల్లో 25.40లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 4,46,03,841కి చేరింది.

మధ్యప్రదేశ్‌లో ఒకరోజు లాక్‌డౌన్‌
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు ఇండోర్‌, భోపాల్‌, జబల్‌పూర్‌ల్లో ఆదివారం ఒకరోజు లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌ విధించాలని ఆదేశించింది. అంతేకాకుండా మార్చి 31 వరకు మూడు నగరాల్లోని అన్ని పాఠశాలలు మూసేయాలని ఆదేశించింది. మరోవైపు తమిళనాడులోనూ కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 9,10,11 తరగతుల విద్యార్థులకు పాఠశాలలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని