G20: కశ్మీర్‌లో జీ20.. నోరుపారేసుకున్న చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్‌

భారత్‌పై చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. పాకిస్థాన్‌ అనుకూల వ్యాఖ్యలు చేసింది. G20 సదస్సు(G20 meeting in Kashmir) నిర్వహించే ప్రాంతంపై చైనా వ్యక్తం చేసిన అభ్యంతరానికి భారత్‌ ఘాటుగా బదులిచ్చింది.  

Updated : 20 May 2023 10:59 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir) విషయంలో చైనా(China) మరోసారి నోరు పారేసుకుంది. పర్యాటక రంగంపై జీ20 వర్కింగ్‌ గ్రూపు మూడో సదస్సు జమ్మూకశ్మీర్‌(G20 meeting in Kashmir)లో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. 

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని శ్రీనగర్‌లో మే 22, 23, 24 తేదీల్లో జరగనున్న జీ 20(G20) సదస్సు కోసం భద్రతాదళాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. స్థానిక షేర్‌ ఏ కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటరులో ఈ సదస్సు జరగనున్నట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీనిపై చైనా స్పందిస్తూ.. జీ20 సదస్సుకు తాము హాజరుకావడం లేదని వెల్లడించింది. వివాదాస్పద భూభాగంలో ఇటువంటి భేటీలను జరపడాన్ని తాము వ్యతిరేకిస్తామని డ్రాగన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్ వ్యాఖ్యలు చేశారు. ‘తన సొంత భూభాగంలో ఎక్కడైనా భారత్  స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహిస్తుంది. చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి సరిహద్దుల వెంబడి శాంతి, సుస్థిరత అవసరం’అని భారత్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సదస్సుకు తుర్కియే, సౌదీ అరేబియా కూడా హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. 

2019లో జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత జరుగుతున్న కీలక అంతర్జాతీయ సమావేశమిది. 60 మందికి పైగా విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారని కేంద్ర టూరిజం కార్యదర్శి అరవింద్‌ సింగ్‌ దిల్లీలో మీడియాకు తెలిపారు. దాంతో భద్రతాపరంగా సున్నితమైన ఈ ప్రాంతంలో ఏ చిన్నపాటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) దళాలు, మెరైన్‌ కమాండోల బృందం, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది, ఇతర పారామిలటరీ బలగాలను ఇప్పటికే మోహరించారు. 

స్థానిక దాల్‌ సరస్సు పరిసర ప్రాంతాలను మెరైన్‌ కమాండోలు జల్లెడ పట్టారు. శికారాల్లో (పడవల్లో) తిరుగుతూ చుట్టూ నిఘా పెంచారు. ఎన్‌ఎస్‌జీ దళాలు స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలతో కలిసి నగరంలోని లాల్‌చౌక్‌ ప్రాంతంలో అణువణువు గాలించాయి. హోటళ్లు తనిఖీ చేశారు. స్థానిక పోలీసులు డ్రోన్‌ వ్యతిరేక వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. సదస్సు ముగిసేదాకా శ్రీనగర్‌ నగరాన్ని ‘నో డ్రోన్‌’జోనుగా ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు తిరుగాడే మార్గాలను అందంగా అలంకరించారు. అనుమానాస్పద అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌, వదంతుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కశ్మీర్‌ పోలీసులు సూచనలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని