Positivity Rate: తగ్గుతున్న కరోనా ఉద్ధృతి

రోజువారీ పాజిటివిటీ రేటు 16.98శాతానికి తగ్గిందని ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది.

Published : 16 May 2021 22:04 IST

న్యూదిల్లీ: ఎవరూ ఊహించని విధంగా భారత్‌ను కరోనా సెకండ్‌వేవ్‌ కుదిపేస్తున్న నేపథ్యంలో తాజా గణాంకాలు కాస్త ఊరటనిస్తున్నాయి. ఒకవైపు కరోనా పాజిటివ్‌ కేసులు నిత్యం భారీగా నమోదవుతున్నా అదే స్థాయిలో కరోనా నుంచి కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్‌ కేసుల కంటే అధికంగా, 55,344 మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్‌ కేసుల సంఖ్య 36,18,458కి పడిపోయిందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.98శాతానికి తగ్గిందని ప్రకటించింది.

దేశంలో కరోనా కేసుల్లో స్థిరీకరణ కనిపిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితి మరింతగా నియంత్రణలోకి వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అత్యధిక క్రియాశీలక కేసులు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌లలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 74.69 యాక్టివ్‌ కేసులు ఈ రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. ‘మే 3న 24.47శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు మే 16వ తేదీకి 16.98శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో 3,62,437మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 2,07,95,335మంది మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు.

ఇక దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.09శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 4,077మంది కరోనాతో పోరాడుతూ మృతి చెందారు.  మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, హరియాణా రాష్ట్రాల్లో అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకూ 18.22 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని