Yasin Malik: యాసిన్‌ మాలిక్‌ను శిక్షిస్తే.. భారత్‌పై విమర్శలా..?

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదు విధించడంపై కొన్ని దేశాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి

Updated : 28 May 2022 10:58 IST

ఉగ్రవాదాన్ని సమర్థించొద్దంటూ ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ హితవు

దిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదు విధించడంపై కొన్ని దేశాలు భారత్‌పై నోరుపారేసుకున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్‌ దేశాలు కోర్టు తీర్పును తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడంపై భారత్‌ దీటుగా స్పందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం పోరాడుతోన్న వేళ.. దాన్ని సమర్థించడం సరికాదంటూ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌(ఓఐసీ)కు హితవు పలికింది.

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు దేశంపై దాడికి కుట్ర తదితర నేరాల్లో యాసిన్‌ మాలిక్‌ దోషిగా తేలడంతో అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఇటీవల ఎన్‌ఐఏ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును ఇస్లామిక్‌ దేశాల మానవ హక్కుల విభాగం ఓఐసీ-ఐపీహెచ్‌ఆర్‌సీ ఖండించింది. యాసిన్‌ మాలిక్‌ శిక్ష విషయంలో భారత్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని అనవసరపు వ్యాఖ్యలు చేసింది.

ఈ నేపథ్యంలో ఇస్లామిక్‌ దేశాల వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చీని మీడియా ప్రశ్నించగా.. ఆయన దీటుగా బదులిచ్చారు. ‘‘యాసిన్‌ మాలిక్‌ కేసులో ఇచ్చిన తీర్పుపై భారత్‌ను విమర్శిస్తూ ఓఐసీ-ఐపీహెచ్‌ఆర్‌సీ చేసిన విమర్శలు ఆమోదయోగ్యం కాదు. ఈ వ్యాఖ్యలతో యాసిన్‌ మాలిక్‌ ఉగ్ర కార్యకలాపాలకు ఆ దేశాలు మద్దతిస్తున్నట్లు అర్థమవుతోంది. ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ సహించకూడదని యావత్‌ ప్రపంచం కోరుకుంటోంది. అలాంటప్పుడు ఓఐసీ ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని సమర్థించకూడదు’’ అని బాగ్చీ ఇస్లామిక్‌ దేశాలను సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని