టీకా ఎగుమతి తగ్గించే యోచనలో కేంద్రం!

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో దేశ అవసరాల దృష్ట్యా కొన్ని రోజులు ఆస్ట్రాజెనెకా టీకాలు పెద్ద ఎత్తున ఎగుమతిని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం.

Published : 25 Mar 2021 15:11 IST

భారత్‌లో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో..

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో దేశ అవసరాల దృష్ట్యా కొన్ని రోజులు ఆస్ట్రాజెనెకా టీకాలు ఎగుమతిని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా దేశంలో కరోనా తీవ్రత పెరగడంతో దేశంలో టీకా ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, ప్రభుత్వం నిర్ణయంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పాటైన ‘కొవాక్స్‌’ కార్యక్రమంపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారుగా భారత్‌ ఉన్న విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా భారీ సంఖ్యలో కొవిడ్‌ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. ఓవైపు భారత్‌లో పంపిణీ చేస్తూనే విదేశాలకు  ఎగుమతి చేస్తోంది. ముఖ్యంగా ఐరాస ‘కొవాక్స్‌’ కార్యక్రమం ద్వారా దాదాపు 64 అల్ప, మధ్య ఆదాయ దేశాలకు సీరం తయారు చేస్తోన్న టీకాలను ఎగుమతి చేస్తున్నారు. సరఫరాలో జాప్యం కారణంగా ఇప్పటికే ఆయా దేశాలు వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ సమయంలో టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం నెలకు దాదాపు 7కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని వచ్చే నెల (ఏప్రిల్‌/మే) నాటికి 10కోట్లకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే, అమెరికా నుంచి వచ్చే ముడిసరుకు కొరతతో టీకాల ఉత్పత్తికి కొంత ఆటంకం ఏర్పడుతున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఇటీవలే వెల్లడించింది.

ఇదిలాఉంటే, దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకాలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 5కోట్ల 30లక్షల డోసులను మాత్రమే పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఎక్కువగా సీరం ఇన్‌స్టిట్యూట్‌వే కావడం గమనార్హం. ఇదే సమయంలో విదేశాలకు మాత్రం భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఇప్పటి వరకు 76దేశాలకు 6కోట్లకుపైగా డోసులను ఎగుమతి చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా 45ఏళ్ల వారు కూడా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశంలో భారీగా టీకాలు అవసరం ఉన్నందున ఎగుమతిని నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని