Modi: JAM-జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌.. ప్రపంచానికే ఓ కేస్‌స్టడీ

ఒకప్పుడు టెలికాం యూజర్‌గా ఉన్న భారత్‌.. ప్రస్తుతం భారీ స్థాయిలో టెలికా సాంకేతికతను (Telecom Technology) ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని ప్రధాని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. 5జీ అందుబాటులోకి తెచ్చిన కొన్ని నెలల్లోనే 6జీపై పరిశోధనలు మొదలుపెట్టామన్నారు.

Updated : 22 Mar 2023 17:58 IST

దిల్లీ: కొన్నేళ్ల క్రితం వరకు టెలికాం వినియోగదారుడిగా ఉన్న భారత్‌.. ఆ సాంకేతికతను (Telecom Technology) భారీగా ఎగుమతి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. దిల్లీలోని ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనిట్‌ (ITU) ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఆయన.. 5జీ సాంకేతికతను అత్యంత వేగంగా అందుబాటులోకి తీసుకొస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటని అన్నారు. 5జీ మొదలుపెట్టిన 120 రోజుల్లోనే 125 నగరాలకు ఈ సేవలను విస్తరించామన్నారు.

‘4జీ కంటే ముందు భారత్‌ కేవలం ఒక టెలికాం యూజర్‌ మాత్రమే. కానీ, ఇప్పుడు టెలికాం టెక్నాలజీని భారీ స్థాయిలో ఎగుమతి చేసేదిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో కొత్తగా 100 5జీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తాం. దేశీయ అవసరాలకు అనుగుణంగా విభిన్నమైన 5జీ అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు ఈ ల్యాబ్‌లు తోడ్పడుతాయి. 2014లో దేశంలో 25కోట్ల మంది ఇంటర్నెట్‌ యూజర్లు ఉంటే ప్రస్తుతం అది 85కోట్లకు చేరింది. 5జీ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన 6 నెలల్లోనే మనం 6జీ గురించి మాట్లాడుతున్నాం. గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 25లక్షల కి.మీ ఆప్టికల్‌ ఫైబర్‌ను వేశాం. జేఏఎం (జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌)’.. ఈ మూడింటి వల్ల సాధించిన ప్రగతి ప్రపంచానికే ఓ కేస్‌ స్టడీగా మారింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

టెలికాం రంగంలో ఎంతో పురోగతి సాధిస్తోన్న ఈ దశాబ్దాన్ని ‘టెకేడ్‌’ (Techade)గా అభివర్ణించిన ప్రధాని మోదీ.. భారత్‌ 6జీ విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. దీనితోపాటు 6జీ పరిశోధనాభివృద్ధి టెస్ట్‌బెడ్‌ను కూడా ప్రారంభించారు. ఇదిలాఉంటే, ఐటీయూ అనేది ఐక్యరాజ్య సమితిలోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ (ICTs)కు సంబంధించిన ప్రత్యేక విభాగం. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. గతంలో ఐటీయూతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, భారత్‌లో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటైంది. భారత్‌తోపాటు నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్గానిస్థాన్‌, ఇరాన్‌ దేశాలకు సహాయ, సహకారాలను అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని