భారత మత్స్యకారుల అపహరణకు పాక్‌ యత్నం.. ఆపై కాపాడామంటూ కట్టుకథ

భారత మత్స్యకారులపై దాడి చేసి, కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన పాక్‌ నేవీ అధికారులపై కేసులు నమోదయ్యాయి. వారిని కాపాడామని పాక్‌ అధికారులు మొదట నమ్మించారని, కానీ మత్స్యకారులు అసలు విషయాన్ని వెల్లడించారని భారత కోస్ట్‌గార్డ్‌ అధికారులు తెలిపారు.

Published : 09 Oct 2022 18:15 IST

దిల్లీ: భారత మత్స్యకారులను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన పాకిస్థాన్‌ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ(PMSA)పై కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌ పోరుబందర్‌లోని నవీ బందర్‌ పోలీసుస్టేషన్‌లో పాక్‌ నేవీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లోని జఖౌ నౌకాశ్రయానికి 45 నాటికల్ మైళ్ల దూరంలో ‘హర్‌సిద్ధి-5’ ప్రాంతంలో అక్టోబర్‌ 6న చేపల వేటలో ఉన్న ఆరుగురు మత్స్యకారులను పాక్‌ నేవీ అధికారులు అపహరించేందుకు యత్నించారని భారత కోస్ట్‌గార్డ్‌ అధికారులు తెలిపారు. అంతకుముందు వారిపై కాల్పులు జరిపి, బోటులోకి చొరబడి దాడి చేశారని ఎస్‌ఓఎస్‌ కాల్‌ ద్వారా తెలిసిందని వెల్లడించారు. పడవను ముంచేందుకు కూడా ప్రయత్నించారని పేర్కొన్నారు.

అయితే, సమాచారం అందగానే హుటాహుటిన తాము అక్కడకు చేరుకోగా.. పాక్‌ అధికారులు అప్పటికప్పుడు ఓ కట్టుకథ అల్లినట్లు పేర్కొన్నారు. మత్స్యకారులను కాపాడామని తమకు చెప్పినట్లు కోస్ట్‌గార్డ్‌ అధికారులు తెలిపారు. పాక్‌ అధికారులు తమను భయపెట్టి తమతో అబద్దాలు చెప్పించారని కూడా మత్స్యకారులు పేర్కొన్నారని వెల్లడించారు. ‘మునిగిపోతున్న తమను పీఎంఎస్‌ఏ బృందం కాపాడి ప్రథమ చికిత్స అందించారు. భోజనం పెట్టి సపర్యలు చేశారు. అందుకు వారికి కృతజ్ఞతలు’ అంటూ ఓ మత్సకారుడు పేర్కొంటున్న వీడియోను పీఎంఎస్‌ఏ ట్విటర్‌ ఖాతాలో పంచుకుంటూ ఇదో గొప్ప విషయం అంటూ బడాయిలకు పోయింది. అయితే, ఇళ్లకు చేరిన మత్స్యకారులు అసలు విషయాన్ని బయటపెట్టారు. తమను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన తీరును భారత ఏజెన్సీకి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పాక్‌ నేవీపై కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని