Agni Prime: నిశీధిలో దూసుకెళ్లిన ‘అగ్ని’ జ్వాల.. ప్రైమ్‌ ప్రయోగం విజయవంతం

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరేందుకు సిద్ధమైంది. అత్యాధునిక బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని ప్రైమ్‌ (Agni Prime)ను డీఆర్‌డీఓ (DRDO) రాత్రి సమయంలో విజయవంతంగా పరీక్షించింది.

Published : 08 Jun 2023 14:14 IST

బాలాసోర్‌: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన వ్యూహాత్మక, అత్యాధునిక బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని ప్రైమ్‌ (Agni Prime)ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని శ్రేణి క్షిపణుల్లో ఒకటైన దీనిని ఒడిశా (Odisha) తీరంలోని బాలాసోర్‌ వద్ద బుధవారం పరీక్షించారు. ఈ ప్రయోగంలో అగ్ని ప్రైమ్‌ నిర్ణీత లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు.

ఏపీజే అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ నుంచి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నిన్న రాత్రి ఈ ప్రయోగం నిర్వహించింది. అభివృద్ధి దశల్లో మూడు సార్లు విజయవంతంగా పరీక్షించారు. ఇక దళాల్లోకి ప్రవేశపెట్టే ముందు తొలిసారి అగ్ని ప్రైమ్‌ (Agni Prime)ను రాత్రి సమయంలో టెస్ట్‌ చేశారు. రాడార్‌, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ వంటి వాటిని విభిన్న లొకేషన్లలో అమర్చి దీన్ని ప్రయోగించారు. క్షిపణి పూర్తి స్థాయి సామర్థ్యం అందుకుందని ఈ పరీక్షతో తేలింది. దీన్ని సాయుధ దళాల్లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని డీఆర్‌డీవో (DRDO) సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రయోగం ఫలించడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. డీఆర్‌డీవో, సాయుధ దళాలను అభినందించారు.

షార్ట్‌ రేంజ్‌ బాలిస్టిక్ క్షిపణి (ballistic missile) అయిన ఇది 1000-1500 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదు. 1000 కిలోల వరకు అణువార్‌హెడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. రెండు స్టేజీలు గల ఈ క్షిపణి అగ్ని-1 కంటే తేలికగా ఉండడం విశేషం. 4000 కి.మీ రేంజ్‌ కలిగిన అగ్ని-4, 5000 కి.మీ రేంజ్‌ కలిగిన అగ్ని-5 ఫీచర్లను సైతం అగ్ని ప్రైమ్‌లో మిళితం చేశారు. అగ్ని సిరీస్‌లో ఇది ఆరో క్షిపణి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని