
India-France: భారత్-ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసాలు.. ఎప్పుడంటే!
దిల్లీ: పట్టణ ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లపై దృష్టి సారించేలా భారత్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్నాయి. ఫ్రాన్స్‌లోని ఫ్రెజుస్ ప్రాంతంలో నవంబర్ 15 నుంచి 26 వరకు ‘ఎక్సర్‌సైజ్ శక్తి 2021’ పేరుతో ఈ విన్యాసాలు జరగబోతున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆదేశాలతో భారత్, ఫ్రాన్స్ మధ్య సైనిక సహకారం పెంపొందించుకోవడంలో భాగంగా ఈ విన్యాసాలు జరగనున్నట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల ద్వైవార్షిక సంయుక్త విన్యాసాల్లో ఇది ఆరో ఎడిషన్.
భారత్ తరఫున గోర్ఖా రైఫిల్ బెటాలియన్ ఈ విన్యాసాల్లో పాల్గొనబోతుంది. గోర్ఖా రైఫిల్స్.. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఫ్రాన్స్ ఆర్మీ నుంచి 6వ లైట్ ఆర్మ్‌డ్ బ్రిగేడ్‌కు చెందిన 21వ మెరైన్ రెజిమెంట్ ప్రాతినిధ్యం వహించనుంది. భారత్, ఫ్రాన్స్ కలిసి భారత వాయు సేనతో ‘ఎక్సర్‌సైజ్ గరుడ’, నావికదళంతో ‘ఎక్సర్‌సైజ్ వరుణ’, సైనికదళంతో ‘ఎక్సర్‌సైజ్ శక్తి’ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. చివరగా 2019లో రాజస్థాన్‌లో ‘ఎక్సర్‌సైజ్ శక్తి’ విన్యాసాలు జరిగాయి.