vaccination: అగ్రదేశం కంటే మనమే ముందు..!

భారత్‌లో కరోనా టీకా కార్యక్రమం వేగం పుంజుకుంది. అగ్రదేశం అమెరికా కంటే మనదేశంలోనే ఎక్కువగా టీకాలు పంపిణీ అయ్యాయి.

Updated : 28 Jun 2021 15:54 IST

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: భారత్‌లో కరోనా టీకా కార్యక్రమం వేగం పుంజుకుంది. అగ్రదేశం అమెరికా కంటే మనదేశంలోనే ఎక్కువగా టీకాలు పంపిణీ అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. మనదేశంలో 32.36 కోట్ల డోసులను వేయగా.. అమెరికా 32.33 కోట్ల డోసుల్ని అందించింది. 18 ఏళ్లుదాటిన ప్రతి భారతీయ పౌరుడికి ఉచితంగా టీకా అందించేలా కేంద్రం గతనెల మార్గదర్శకాలు సవరించిన సంగతి తెలిసిందే. జూన్ 21 నుంచి అవి అమల్లోకి వచ్చాయి. ఆ రోజున రికార్డు స్థాయిలో 86 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఈ వారం రోజుల్లో 4.1 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

కరోనా మహమ్మారికి విరుగుడుగా మనదేశంలో జనవరి 16న టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమెరికాలో మాత్రం గతేడాది డిసెంబర్ 14నే టీకాల పంపిణీ మొదలైంది. ఇక మనదేశంలో నిన్నటి వరకు 26,69,33,878 మందికి తొలి డోసును అందించగా..5,67,29,419 మంది రెండో డోసును స్వీకరించారు. టీకా డోసుల పంపిణీలో అమెరికాతో పోటీ పడుతున్నప్పటికీ.. అక్కడి కంటే మనదేశంలో జనాభా దాదాపు మూడు రెట్లు అదనమని నిపుణులు గుర్తుచేస్తున్నారు. 

మరోపక్క టీకాలపై ఉన్న అనుమానాలను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నాయి. ‘టీకాలపై అపోహలు వీడండి’ అంటూ స్వయంగా ప్రధానే ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను రెండు డోసులు తీసుకున్నాని, వందేళ్ల వయస్సులో తన తల్లి కూడా రెండు డోసులు అందుకున్నారని చెప్పారు. టీకా తీసుకోకపోతేనే ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. సైన్స్‌, మన శాస్త్రవేత్తలపై విశ్వాసం ఉంచాలని కోరారు.  టీకా డోసుల పంపిణీలో భారత్ అమెరికాను అధిగమించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘భారత్‌ టీకా కార్యక్రమం వేగం పుంజుకుంది. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ‘అందరికీ టీకాలు, అందరికీ ఉచితం’ అనే నినాదానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మరోసారి ఆయన ప్రస్తావించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని