Amit Shah: అమెరికా, ఇజ్రాయెల్‌ల సరసన భారత్‌.. అమిత్‌షా కీలక వ్యాఖ్యలు

తమ సరిహద్దుల విషయంలో జోక్యం చేసుకునే వారిని తిప్పికొట్టే అమెరికా, ఇజ్రాయెల్‌ల సరసన భారత్‌ కూడా చేరిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఉరి, పుల్వామాల్లో ఉగ్రదాడుల అనంతరం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌, వైమానిక...

Published : 03 May 2022 22:21 IST

బెంగళూరు: తమ సరిహద్దుల విషయంలో జోక్యం చేసుకునే వారిని తిప్పికొట్టే అమెరికా, ఇజ్రాయెల్‌ల సరసన భారత్‌ కూడా చేరిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఉరి, పుల్వామాల్లో ఉగ్రదాడుల అనంతరం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌, వైమానిక దాడులను ప్రస్తావిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో.. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడల్లా కేంద్రం కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యేదని, అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. ‘గతంలో అమెరికా, ఇజ్రాయెల్.. ఈ రెండు దేశాలు మాత్రమే తమ సరిహద్దులు, సైన్యం విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నప్పుడు ప్రతీకారం తీర్చుకునేవి. ఇప్పుడు భారత్‌ ఈ జాబితాలో చేరింది’ అని అన్నారు. కర్ణాటకలో మంగళవారం నృపతుంగ విశ్వవిద్యాలయంతోపాటు వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం షా ఈ మేరకు ప్రసంగించారు.

‘పాక్‌ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్స్‌, వైమానిక దాడులు ఎలాంటి ప్రభావం చూపాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఈ దాడుల ప్రభావం చాలా ఉంటుంది. ‘భారత సమగ్రత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరు. లేనిపక్షంలో.. వారికి తగిన గుణపాఠం దక్కుతుంద’ని ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసింది’ అని మంత్రి అన్నారు. దేశంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలవడంపై.. సీఎం బసవరాజ్ బొమ్మైకి అభినందనలు తెలిపారు. ఈ విద్యావిధానం భారత్‌ను గొప్ప దేశంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని.. ప్రపంచంతో పోటీపడేలా యువతకు ఓ వేదికను అందిస్తుందన్నారు. ఇది ప్రాంతీయ భాషలకూ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరుపుకొనే సమయానికి భారత్‌ 'విశ్వగురువు'గా మారాలని యువతకు పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని