
వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి.. 150కోట్లు దాటిన టీకాల పంపిణీ
దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టే బృహత్తర వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. టీకా పంపిణీలో 150కోట్ల మైలురాయిని అధిగమించినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో గల ఛిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ రెండో క్యాంపస్‌ను ప్రధాని నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు భారత్ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు దేశంలో 150కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశాం. టీకాలకు అర్హులైన వారిలో 90శాతానికి పైగా ప్రజలు తొలి డోసు అందుకున్నారు. ఇక 15-18 ఏళ్ల వయసు వారికి టీకా పంపిణీ కూడా శరవేగంగా కొనసాగుతోంది. తొలి ఐదు రోజుల్లోనే 1.5కోట్లకు పైగా మంది టీనేజర్లు తొలి డోసు తీసుకున్నారు’’ అని మోదీ వెల్లడించారు. కొవిన్ గణాంకాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి దేశవ్యాప్తంగా 150.06కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో గతేడాది జనవరి 16న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు, ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయడం ప్రారంభమైంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్ వేయడం మొదలు పెట్టారు. ఆరంభంలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ.. గతేడాది రెండో దశ ఉద్ధృతి సయమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. అలా టీకా పంపిణీలో గతేడాది అక్టోబరు 21న చారిత్రక 100 కోట్ల మైలురాయిని అందుకుంది.
అయితే ఇటీవల ఒమిక్రాన్ రూపంలో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. వ్యాక్సినేషన్ పరిధిని మరింత విస్తరించింది. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకాలు పంపిణీ చేస్తోంది. ఇక జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రికాషన్ డోసు అందించేందుకు సన్నద్ధమవుతోంది.
ఇవీ చదవండి
Advertisement