Manoj Pande: కుంగుతున్న జోషీమఠ్‌.. మరో ప్రాంతానికి సైన్యం తరలింపు..!

కుంగిపోతున్న జోషీమఠ్‌ నుంచి భారత సైన్యం తన బలగాలను తరలించింది. దీని వల్ల తమ సంసిద్ధతపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్‌ పాండే వెల్లడించారు. 

Updated : 13 Jan 2023 12:03 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌(Uttarakhand)కు చెందిన జోషీమఠ్‌(Joshimath)లోని వందల ఇళ్లకు పగుళ్లు రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇళ్లు, భవనాలతో పాటు ఇప్పుడు ఆర్మీ భవనాలకు బీటలు వచ్చాయి. దాంతో భారత సైన్యం(Indian Army) అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖకు దగ్గర్లో ఉన్న ఈ పర్యాటక ప్రాంతం పరిసర ప్రదేశాల నుంచి బలగాలను తరలించింది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే(Manoj Pande) వెల్లడించారు. అవసరమైతే మరింత మందిని తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దీనివల్ల తమ సంసిద్ధతపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం  చేశారు. మరోపక్క ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 

చైనా(China) సరిహద్దు వద్ద ప్రశాంతంగానే ఉంది, కానీ..

భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగానే ఉందని మనోజ్ పాండే వెల్లడించారు. అయితే భవిష్యత్‌ పరిస్థితులను అంచనా వేయలేమని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగిన స్థాయిలో బలగాలను మోహరించామంటూ గురువారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాల కదలికలు ఉన్నాయని. ఇరుదేశాల మధ్య యథాతథ స్థితిని కొనసాగించేందుకు మిలిటరీ, దౌత్య స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. 

ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. జనవరి ఒకటి నుంచి అగ్నివీర్‌ మొదటి బ్యాచ్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. సైన్యంలో మార్షల్ ఆర్ట్స్‌కోసం ప్రత్యేకంగా ‘అమర్’ పేరిట కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దీనిద్వారా ప్రతి సైనికుడు శారీరంగా దృఢంగా ఉండేందుకు, సరిహద్దుల్లో పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించేందుకుశిక్షణ ఇస్తున్నామన్నారు. సరిహద్దుల్లో పాక్‌ నుంచి డ్రోన్లు, ఇతర మార్గాల్లో ఆయుధాలు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయిని, బీఎస్‌ఎఫ్, భద్రతాబలగాల సాయంతో వాటిని అడ్డుకుంటున్నామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని