India-Pakistan: పాక్‌కు భారత్ ఆహ్వానం.. 12 ఏళ్ల తర్వాత దేశానికి దాయాది మంత్రి..!

దాదాపు 12 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ (Pakistan) విదేశాంగ మంత్రి భారత్‌కు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. షాంఘై సదస్సు (SCO) నిమిత్తం భారత విదేశాంగ మంత్రి దాయాదికి ఆహ్వానం పంపారు.

Published : 25 Jan 2023 11:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉగ్రవాదం, కశ్మీర్‌ అంశాలపై భారత్ (India), పాకిస్థాన్‌ (Pakistan) మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. గోవా వేదికగా త్వరలో జరగబోయే షాంఘై సహకార సంస్థ- ఎస్‌సీఓ (SCO) సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం.. దాయాదికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్‌. జైశంకర్ (S Jaishankar)‌.. పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో (Bilawal Bhutto)కు అధికారికంగా ఆహ్వానం పంపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

గతేడాది సెప్టెంబరులో షాంఘై సదస్సుకు అధ్యక్ష బాధ్యతలు అందుకున్న భారత్‌.. ఈ ఏడాది వేసవిలో మంత్రుల స్థాయి సమావేశాలు నిర్వహించనుంది. మే 4-5 తేదీల్లో గోవా వేదికగా విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌.. ఇటీవల ఎస్‌సీఓ (SCO) సభ్య దేశాలకు ఆహ్వానాలు పంపింది. చైనా, రష్యా, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ వంటి దేశాలతో పాటు పాకిస్థాన్‌కు కూడా ఈ ఆహ్వానం పంపినట్లు సదరు కథనాలు తెలిపాయి. అయితే, దీనిపై పాక్‌ నుంచి ఇంతవరకూ స్పందన రాలేదు. ఒకవేళ, ఈ ఆహ్వానాన్ని దాయాది అంగీకరిస్తే.. పాక్‌ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే కానుంది. అంతకుముందు 2011లో అప్పటి పాక్‌ (Pakistan) విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్‌.. భారత్‌లో పర్యటించారు.

భారత్‌-పాక్‌ సంబంధాలపై ఇటీవల పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మూడు యుద్ధాల నుంచి తాము చాలా నేర్చుకున్నామని, పొరుగు దేశంతో ప్రశాంత వాతావరణంలో సంబంధాలు కోరుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా.. ‘పొరుగుదేశాలే ప్రథమ ప్రాధాన్యం’ విధానంలో భాగంగా పాక్‌కు ఈ ఆహ్వానం పంపామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే, దేశ భద్రతా అంశాలపై తాము ఎన్నటికీ రాజీ పడబోమని భారత్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. 2015లోనూ భారత్‌ ఓ సదస్సు నిమిత్తం అప్పటి పాక్‌ విదేశాంగ మంత్రి సర్తాజ్‌ అజీజ్‌కు ఆహ్వానం పంపింది. దిల్లీకి వచ్చేందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే పర్యటనలో భాగంగా హురియత్‌ నేతలను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని మెలిక పెట్టారు. దీంతో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, కేంద్ర ప్రభుత్వం కలిసి ఆ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్నాయి.

పుల్వామా దాడులు, సీమాంతర ఉగ్రవాదం, ఆర్టికల్‌ 370 రద్దు వంటి అంశాల నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్న విషయం తెలిసిందే. అంతేగాక, ఇటీవల పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో.. భారత ప్రధాని మోదీ (Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో షాంఘై సదస్సుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని