Nitin Gadkari: పేద ప్రజలున్న ధనిక దేశం మనది: గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ప్రపంచంలో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి ధనిక దేశమైనప్పటికీ.. ప్రజలు మాత్రం పేదలుగానే ఉన్నారని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.......

Published : 30 Sep 2022 01:10 IST

నాగ్‌పూర్‌: ప్రపంచంలో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి ధనిక దేశంగా నిలిచినప్పటికీ.. ప్రజలు మాత్రం పేదలుగానే ఉన్నారని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkarai) అన్నారు. వారంతా ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. గురువారం నాగ్‌పూర్‌లో గడ్కరీ భారత్‌ వికాస్‌ పరిషత్‌ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. దేశంలో ధనిక, పేదల మధ్య అంతరం పెరుగుతోందని దీనికి అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే. పేద జనాభా ఉన్న ధనిక దేశం. మన దేశం సంపన్న దేశమే.. కానీ ప్రజలే ఆకలి, నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, కులతత్వం, అంటరానితనం వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇది సమాజ పురోగమనానికి మంచిది కాదు’’ అన్నారు. 

భారత సమాజంలో సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో రెండు వర్గాల మధ్య అంతరం పెరిగిపోయిందన్న గడ్కరీ..  సామాజిక అసమానతల్లాగే ఆర్థిక అసమానతలూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పేద-ధనిక వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు విద్య, ఆరోగ్యం, సేవా రంగాల్లో కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశంలోని సామాజికంగానూ, విద్య, ఆరోగ్య రంగాల్లో వెనుకబడిన 124 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ఐక్యంగా కృషిచేయాలన్నారు. పట్టణ ప్రాంతాలు అభివృద్ధికి తార్కాణాలుగా నిలుస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు, అవకాశాలు తగినంతగా లేకపోవడంతో అక్కడి జనం భారీగా నగరాలకు వలస వెళ్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల సాధికారత సాధించే దిశగా భారత్‌ వికాస్‌ పరిషత్‌ లాంటి సంస్థలు కృషిచేయాలని ఈ సంద్భంగా కోరారు. 21వ శతాబ్దం భారత్‌దేనని స్వామి వివేకానందుడు చెప్పారని.. దేశ ప్రగతికి ప్రతిఒక్కరూ తమ సహకారం అందించాలని గడ్కరీ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని