Defence: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం!

వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగినా వాటిని ఎదుర్కొనేందుకు సైన్యం సంసిద్ధంగా ఉందని రక్షణ శాఖ స్పష్టం చేసింది. లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో గతేడాది....

Updated : 15 Jun 2021 22:22 IST

దిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగినా వాటిని ఎదుర్కొనేందుకు సైన్యం సంసిద్ధంగా ఉందని రక్షణ శాఖ స్పష్టం చేసింది. లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో గతేడాది జూన్ 15 రాత్రి చైనా దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో స్పందించిన రక్షణ శాఖ.. సరిహద్దు వెంబడి భారత్-చైనాల బలగాల మధ్య నెలకొన్న అపనమ్మకం కారణంగా మరింత అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపింది. చైనా పట్ల అనుసరించాల్సిన వైఖరిని గల్వాన్  ఘటన స్పష్టం చేసిందన్న రక్షణశాఖ.. డ్రాగన్‌తో నెలకొన్న భద్రతా ముప్పును గుర్తించి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంది.

ఉత్తర సరిహద్దు ప్రాంతంలో సైన్యాన్ని మరింత అప్రమత్తం చేయటంతో పాటు, జాతీయ భద్రతా విధానానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు గల్వాన్‌ ఘటన ఊతమిచ్చినట్లు పేర్కొంది. మిలటరీ, వాయుసేన మరింత సమన్వయంతో పనిచేసేందుకు గల్వాన్ ఉదంతం దోహదపడిందని తెలిపింది. అయితే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు భారత్-చైనా మధ్య కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నా పరిస్థితులు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయి.

గల్వాన్ ఘటనకు నేటితో ఏడాది పూర్తయిన వేళ అమరవీరులకు భారత సైన్యం నివాళి అర్పించింది. ఈ ఘర్షణలో కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు అమరులయ్యారు. ఘటన జరిగి ఏడాది పూర్తికాగా లేహ్‌లో ఉన్న యుద్ధ స్మారకం వద్ద గల్వాన్ వీరులకు మేజర్ జనరల్ ఆకాశ్ కౌశిక్, భద్రతా దళాలు నివాళులు అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని