
అక్కడి భారతీయులు కాస్త జాగ్రత్త!
మయన్మార్‌లోని ఇండియా రాయబార కార్యాలయం సూచన
దిల్లీ: మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మయన్మార్‌లో ఉంటున్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని పేర్కొంది. సైనిక పాలన నేపథ్యంలో అక్కడి భారత పౌరులంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. విమాన సర్వీసులు సైతం రద్దు కావడంతో యంగూన్-దిల్లీ మధ్య నడవాల్సిన ఎయిరిండియా సర్వీసుని సైతం వాయిదా వేశారు.
మయన్మార్‌లో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఒకే ఒక్క సాకుతో సోమవారం తెల్లవారుజామున అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దేశంలో అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) కీలక నేత ఆంగ్ సాన్ సూకీ, అధ్యక్షుడు విన్ మింట్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరినీ సైన్యం నిర్బంధించింది. సైన్యాధిపతి మిన్ ఆంగ్ లయాంగ్ ఇక నుంచి సర్వాధికారాలు చెలాయించనున్నారు. ప్రపంచదేశాలు మయన్మార్ సైనిక తిరుగుబాటుని తీవ్రంగా ఖండించాయి. వెంటనే తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని సూచించాయి. మరోవైపు ఈ అంశాన్ని ఐరాస భద్రతా మండలిలో చర్చించాలని ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న యునైటెడ్ కింగ్డమ్ నిర్ణయించింది. మంగళవారం ప్రారంభం కాబోయే సమావేశాల్లో దీనిపై రహస్యంగా చర్చించనున్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి...
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.