Modi-Kishida: భారత పర్యటనలో జపాన్‌ ప్రధాని కిషిదా.. మోదీతో భేటీ..!

జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా (Fumio Kishida) భారత ప్రధాని మోదీతో (Narendra Modi) భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్న కిషిదా.. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. 

Published : 20 Mar 2023 14:54 IST

దిల్లీ: భారత పర్యటనలో భాగంగా జపాన్‌ (Japan) ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా (Fumio Kishida) సోమవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. భారత్‌-జపాన్‌ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఇరువురు నేతలు విస్తృత అంశాలపై చర్చలు జరిపినట్లు పీఎం కార్యాలయం వెల్లడించింది. సుమారు 27గంటల పాటు కిషిదా పర్యటన భారత్‌లో కొనసాగనుంది. ఉక్రెయిన్‌ సంక్షోభంతోపాటు ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడు ప్రదర్శిస్తోన్న సమయంలో తాజా భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

‘భారత్‌-జపాన్‌ల మధ్య వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైంది. జీ20కి భారత్‌, జీ7కు జపాన్‌ అధ్యక్షత వహిస్తోన్న సమయంలో కలిసి పని చేయడమనేది మంచి అవకాశం. భారత అధ్యక్షతన జరుగుతోన్న జీ20 సదస్సుకు సంబంధించి ప్రాధాన్యాలను పీఎం కిషిదాకు వివరించా. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించాం. రక్షణ, డిజిటల్‌ టెక్నాలజీ రంగాల్లో సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నాం. సెమీ కండక్టర్ల సరఫరా గొలుసుతోపాటు ఇతర ముఖ్యమైన సాంకేతికతలపై చర్చలు జరిపాం’ అని కిషిదాతో భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. జపాన్‌ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్‌కు సంబంధించిన ప్రణాళికను భారత్‌లోనే వెల్లడిస్తానని అన్నారు. భారత్‌తో తమ ఆర్థిక సహకారం అభివృద్ధికి దోహదం చేయడంతోపాటు జపాన్‌కూ ఆర్థిక అవకాశాలను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతకుముందు మాట్లాడిన ఇరు దేశాల ప్రతినిధులు.. రక్షణ, భద్రత వంటి అంశాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికతల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. శాంతియుత, స్థిరత్వ, సుసంపన్నమైన ప్రపంచం కోసమే ఇరుదేశాలు ఈ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని