Cyber Security index: భారత్‌ @10 చైనా @33

గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీ సూచీలో భారత్‌ పదో స్థానంలో నిలిచింది. 2019లో 47వ స్థానానికి పరిమితమైన భారత్‌ ఈ అంశంలో తాజాగా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది.

Updated : 29 Jun 2021 22:27 IST

దిల్లీ: గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీ సూచీలో భారత్‌ పదో స్థానంలో నిలిచింది. 2019లో 47వ స్థానానికి పరిమితమైన భారత్‌ ఈ అంశంలో తాజాగా తన ర్యాంకును మరింతగా మెరుగుపరుచుకుంది. ఇదే అంశంలో చైనా 33, పాకిస్థాన్‌ 79వ ర్యాంకులకు పరిమితమైనట్టు ఐక్యరాజ్య సమితి (ఐరాస) చేసిన అధ్యయనంలో తేలింది. ప్రపంచ శాంతి, సైబర్‌ సెక్యూరిటీపై ఐరాస భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చలో పాల్గొన్న సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా ఈ విషయాలను వెల్లడించారు. దేశాల మధ్య నెలకొన్న సాంకేతికపరమైన అంతరాలు సైబర్ వ్యవస్థలో అస్థిరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. కొవిడ్‌ అనంతర కాలంలో సాంకేతికతపై పెరుగుతున్న విశ్వాసం డిజిటల్ అసమానతలను బహిర్గతం చేసిందన్నారు. డిజిటల్‌ సామర్థ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే ఈ అంతరాలను తగ్గించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సైబర్‌ వ్యవస్థపై ఉగ్రమూకల దాడులను మరింత వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలని ఐరాస సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదులు సైతం తమ భావజాలాన్ని ప్రచారం చేయడంతోపాటు విద్వేషాలను ప్రేరేపించేందుకు అధునాతన సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. 

ఆయా దేశాలకు సంబంధించిన కీలకమైన మౌలిక సదుపాయాలపై సైబర్‌ దాడుల ముప్పు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. సైబర్‌ సెక్యూరిటీ అంశం ప్రాధాన్యంగా యూఎన్‌ఎస్‌సీ తన తొలి సాధారణ పమావేశాన్ని నిర్వహించింది. సైబర్‌ దాడులను ఎదుర్కోవడంలో ఐరాస సభ్య దేశాలన్నీ ఒకరికొకరు సహకారం అందించుకోవాలని 2015లోనే తీర్మానించుకున్నట్టు సైబర్‌ సెక్యూరిటీలో నైపుణ్యం ఉన్న ఐరోపా ప్రతినిధి ఒకరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని