Vaccine: 2 ఏళ్ల చిన్నారులకు టీకా ఎప్పుడంటే..?

భారత్‌లో సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్యకాలంలో చిన్నారులకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని ఎయిమ్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 24 Jun 2021 13:59 IST

పిల్లలపై కొనసాగుతోన్న క్లినికల్‌ ట్రయల్స్‌

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో టీకాలను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం 18ఏళ్ల వయసుపైబడిన వారికి మాత్రమే టీకా అందిస్తున్నారు. అయితే, రెండేళ్ల వయసు పైబడిన పిల్లలకు టీకా ఎప్పుడొస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్‌లో సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్యకాలంలో చిన్నారులకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని ఎయిమ్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

‘చిన్నారులు కొవిడ్‌ బారినపడితే వారిలో లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తాయి. మహమ్మారిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాల్సిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌తో పాటు ఇతర కంపెనీలు చిన్నారులపై ప్రయోగాలు (Clinical Trials) అత్యంత వేగంగా కొనసాగిస్తున్నాయి. ప్రయోగ సమాచార విశ్లేషణ అనంతరం దేశంలో చిన్నారులకు సెప్టెంబర్‌-అక్టోబర్‌ నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది’ అని ఓవార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో AIIMS డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు. చిన్నారులపై కొవాగ్జిన్‌ టీకా రెండు, మూడో దశల ప్రయోగాల సమాచారం సెప్టెంబర్‌ నాటికి వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో విశ్లేషణ, అనుమతుల ప్రక్రియ అనంతరం సెప్టెంబర్‌-అక్టోబర్‌ నాటికి దేశంలో టీకా అందుబాటులోకి వస్తుందని డాక్టర్‌ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక జైడస్‌ క్యాడిలా (Zydus Cadila) వ్యాక్సిన్‌ గురించి స్పందించిన గులేరియా.. తొలిసారి కొత్త సాంకేతికతతో వ్యాక్సిన్‌ రూపొందించడం దేశానికే గర్వకారణమన్నారు. గతంలో దేశంలో ఈ విధానంలో వ్యాక్సిన్‌ల రూపకల్పన జరగలేదన్నారు. ప్రస్తుతం జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారం సేకరణ దశలో ఉందని.. త్వరలోనే అనుమతుల కోసం సదరు సంస్థ డీసీజీఐ (DCGI) కి అందించనుందని ఎయిమ్స్‌ చీఫ్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను 2 నుంచి 18ఏళ్ల వయసు పిల్లలపై దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 12 నుంచి 18ఏళ్ల వారిపై ప్రయోగాలు పూర్తికాగా.. 6నుంచి 12ఏళ్ల చిన్నారులపై ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. అనంతరం 2 నుంచి ఆరేళ్ల పిల్లలపై ప్రయోగాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని