India Corona: వరుసగా రెండోరోజూ 7వేలకుపైనే కేసులు..

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. వరుసగా రెండోరోజు కొత్త కేసులు ఏడు వేల మార్కు దాటాయి.

Published : 10 Jun 2022 10:02 IST

రెండు శాతం పైనే పాజిటివిటీ రేటు

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. వరుసగా రెండోరోజూ కొత్త కేసులు ఏడు వేల మార్కు దాటాయి. క్రియాశీల కేసులు దాదాపు నాలుగు వేల మేర పెరిగి, 36 వేలకు ఎగబాకాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* గురువారం 3.35 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 7,584 మంది వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే 300 మేర కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 2.26 శాతానికి చేరి, ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మహారాష్ట్ర(2,813), కేరళ(2,193)లోనే ఐదు వేలకు పైగా కేసులొచ్చాయి. దిల్లీ(622)లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లు విస్తరిస్తుండటంతో కేంద్రం స్థానిక ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని సూచించింది.

* రోజురోజుకూ క్రియాశీల కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ముందురోజు 32,498గా ఉన్న కేసులు.. తాజాగా 36,267(0.08శాతం)కు పెరిగాయి.

* నిన్న 3,791 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.70 శాతానికి తగ్గిపోయింది. 24 గంటల వ్యవధిలో 24 మరణాలు సంభవించాయి. మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా మృత్యుఒడికి చేరుకున్నారు. 

* ఇక నిన్న 15.31 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 194 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని