AIIMS chief: రోజూ కోటి మందికి వ్యాక్సిన్‌

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే దేశంలో టీకాల ఉత్పత్తిని పెంచాలని ఎయిమ్స్‌ చీఫ్ డా.రణదీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు....

Published : 30 May 2021 01:32 IST

విదేశాల నుంచి వ్యాక్సిన్ల సేకరణకు వ్యూహంతో పనిచేయాలి

దిల్లీ: వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే దేశంలో టీకాల ఉత్పత్తిని పెంచాలని ఎయిమ్స్‌ చీఫ్ డా.రణదీప్‌ గులేరియా సూచించారు. విదేశాల నుంచి వ్యాక్సిన్ల సేకరణకు సమగ్ర వ్యూహంతో పనిచేయాలన్నారు. ‘జులై చివరినాటికి ప్రతి రోజూ కోటి మందికి టీకా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం టీకా ఉత్పత్తిని పెంచాలి. విదేశాల నుంచి వ్యూహాత్మకంగా డోసులను తెప్పించుకోవాలి’ అని గులేరియా పేర్కొన్నారు.

వ్యాక్సిన్ సేకరణకు కచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు.  పలువురితో కాకుండా ఒక్కరితోనే చర్చలు జరిపేందుకు తయారీదారులు ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. ఔషధ తయారీదారులు దిల్లీ, పంజాబ్‌తోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను నెరవేర్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరిపేందుకు వారు సుముఖంగా ఉన్నట్లు గులేరియా గుర్తుచేశారు. టీకాలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేయాలన్నారు.

గర్భిణులకు త్వరగా టీకా వేయాలని ఎయిమ్స్‌ చీఫ్‌ సూచించారు. ‘గర్భిణుల్లో అనారోగ్య సమస్యలతోపాటు మరణాల రేటు అధికంగా ఉందని, కాబట్టి వారికి త్వరగా వ్యాక్సిన్ అందించాలి’ అని ఆయన పేర్కొన్నారు. కొవాగ్జిన్‌ టీకా అయితే  గర్భిణులకు మరింత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మల్టీ విటమిన్లు, జింక్ సప్లిమెంట్స్ వంటి రోగనిరోధక శక్తి బూస్టర్ల వాడకంపై వివరణ ఇస్తూ.. అవి ఎలాంటి హాని చేయవన్నారు. కానీ వాటిని ఎక్కువ కాలం తీసుకోకూడదని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని