IAF chief: అంతరిక్షంపై భారత్‌ పట్టు సాధించాలి: వాయుసేన చీఫ్‌

భారత్‌ అంతరిక్షంలో కూడా తన శక్తిని పెంపొందంచుకోవాలని వాయుసేన చీఫ్‌ పేర్కొన్నారు. ఈ దిశగా రక్షణ రంగ పరిశ్రమలు కృషి చేయాలన్నారు. 

Published : 23 Mar 2023 00:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ అంతరిక్షంలో కూడా శక్తిసామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సి ఉందని వాయుసేన అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరి  పేర్కొన్నారు. ఆయన ఓ సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. యాంటీశాటిలైట్‌ ఆయుధాలు, క్షిపణులు,  కోఆర్బిటల్‌ కిల్లర్స్‌, డైరెక్ట్‌ ఎనర్జీ ఆయుధాలను మోహరిస్తున్న సమయంలో.. భారత్‌ ఎదురు దాడిచేయడంతోపాటు.. ఆత్మరక్షణ చేసుకోగల  సామర్థ్యాలను సంతరించుకోవాలన్నారు. ఇప్పటికే అంతరిక్షంలో ఆయుధ పోటీ మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు. మన భవిష్యత్తు యుద్ధాలు భూమి,సముద్రం,గగనతలం,సైబర్‌, అంతరిక్షం వేదికగా జరుగుతాయని చెప్పారు. మనం ఇప్పటికే అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలను వాడుకొని భవిష్యత్తుకు సిద్ధం కావాలన్నారు. 

ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భారత వాయుసేన ఏరోస్పేస్‌ ఫోర్స్‌గా మారే సమయం ఆసన్నమైందని సూత్రప్రాయంగా పేర్కొన్నారని చౌధరి వెల్లడించారు. ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నట్లు చెప్పారు.  ఉపగ్రహాలు, స్పేస్‌క్రాఫ్ట్‌లను ఆన్‌డిమాండ్‌పై ప్రయోగించడం సాధారణమైందన్నారు. వీటిని ప్రైవేటు సంస్థలు, సైన్యాలు విస్తృతంగా వాడుకొంటాయన్నారు. 

అంతరిక్షం ఇతరులపై ఆధిపత్యం సాధించడానికి వేదికగా మారిందని వాయుసేన చీఫ్‌ పేర్కొన్నారు. భారత రక్షణ పరిశ్రమ డైరెక్ట్‌ ఎనర్జీ ఆయుధాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వాయుసేన అధిపతి ఆకాంక్షించారు. లేజర్‌, హైపర్‌ సోనిక్‌ ఆయుధాలు అభివృద్ధి చేసి వాటిని విమానాలపై అమర్చేలా చూసుకోవాలన్నారు. వీటి రేంజ్‌ పెంచడానికి, కచ్చితత్వానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సంప్రదాయ ఆయుధాలపై ఇది కచ్చితమైన ఆధిపత్యాన్ని అందిస్తుందని చెప్పారు. దీంతోపాటు తక్కువ ఖర్చు, అత్యధిక కచ్చితత్వం, వేగంగా తరలించడానికి, గోపత్యకు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని