Vaccine: భారత్‌కు 75లక్షల మోడెర్నా టీకాలు

భారత్‌లో కరోనా మూడో ముప్పు పొంచి ఉన్న వేళ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే విదేశీ టీకాలను దిగుమతి చేసుకునేందుకు

Published : 20 Jul 2021 10:55 IST

కొవాక్స్ ద్వారా అందించనున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వర్గాల వెల్లడి

దిల్లీ: భారత్‌లో కరోనా మూడో ముప్పు పొంచి ఉన్న వేళ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే విదేశీ టీకాలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. త్వరలోనే భారత్‌కు 75లక్షల మోడెర్నా టీకాలు రానున్నట్లు తెలుస్తోంది. కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా వీటిని అందజేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు వెల్లడించాయి.

‘‘ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ కోసం ఏర్పాటైన కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా భారత్‌కు 7.5 మిలియన్ల మోడెర్నా టీకా డోసులను అందించనున్నాం’’ అని సదరు వర్గాలు తెలిపాయి. అయితే ఇవి దేశానికి ఎప్పుడు చేరుకుంటాయన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే విదేశీ టీకా సంస్థలకు ఇండెమ్నిటీ అంశంపై కేంద్రం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు, ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇండెమ్నిటీ క్లాజ్‌పై స్పష్టత వస్తేనేగానీ.. విదేశీ టీకాలు భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు.

కాగా.. భారత్‌లో మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ టీకా డోసులు దిగుమతి చేసుకునేందుకు దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు అనుమతులు మంజూరు చేసింది. మోడెర్నా డోసుల దిగుమతిపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతోందని నీతీ ఆయోగ్‌ సభ్యులు డా.వీకే పాల్‌ ఆ మధ్య తెలిపారు. ఇండెమ్నిటీ మినహాయింపు కల్పించేందుకు విదేశీ సంస్థలకు కొన్ని షరతులు విధిస్తామని కేంద్రం చెబుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని