India-Canada: కెనడా పార్లమెంట్‌లో నిజ్జర్‌కు సంతాపం.. స్పందించిన భారత్‌

కెనడా పార్లమెంట్ వేదికగా ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌కు ట్రూడో ప్రభుత్వం నివాళి అర్పించడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది.

Published : 21 Jun 2024 19:53 IST

దిల్లీ: భారత్‌తో కొనసాగుతోన్న దౌత్యపరమైన విభేదాలకు ఇటీవల కెనడా మరింత ఆజ్యం పోసిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar)కు పార్లమెంట్‌ వేదికగా సంతాపం ప్రకటించింది. దీనిపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది.‘‘వేర్పాటువాదాన్ని, హింసను సమర్థించే రాజకీయాలకు చోటు కల్పించే చర్యలను మేం సాధారణంగానే వ్యతిరేకిస్తాం’’ అని స్పష్టం చేసింది.

2023 జూన్‌ 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్‌ హత్య (Nijjar's killing) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్‌ (India) ఖండించింది. నిజ్జర్‌ హత్యకు గురై ఏడాదైన సందర్భంగా ట్రూడో సర్కారు అతడికి ప్రత్యేకంగా నివాళులర్పించడం గమనార్హం. ఏకంగా దేశ పార్లమెంట్‌లో ఈ సంతాప కార్యక్రమం నిర్వహించింది. ఎంపీలంతా లేచి నిలబడి మౌనం పాటించారు.

‘‘ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న వ్యక్తి హత్యకు దేశ పార్లమెంట్‌లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి’’ అంటూ కొందరు నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం దీనికి తగిన కౌంటర్ కూడా ఇచ్చింది. ఎయిరిండియా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చివేసి జూన్‌ 23 నాటికి 39 సంవత్సరాలు. సిక్కు వేర్పాటువాదులు పెట్టిన బాంబుకి ఆ విమానం తునాతునకలు కావడంతో 329 మంది మృతి చెందారు. ఆ రోజున వాంకోవర్‌లోని స్టాన్లీ పార్క్‌ వద్ద సెపెర్లీ ప్లేగ్రౌండ్‌లో ఉన్న ఎయిరిండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నట్టు దౌత్య కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని