కరోనా కల్లోలం: బ్రెజిల్‌ను దాటేసిన భారత్

నిత్యం లక్షకుపైగా కొత్త కేసులతో భారత్‌లో కరోనా వైరస్ బుసలు కొడుతోంది.

Published : 12 Apr 2021 12:24 IST

దిల్లీ: నిత్యం లక్షకుపైగా కొత్త కేసులతో భారత్‌లో కరోనా వైరస్ బుసలు కొడుతోంది. తాజాగా 1,68,912 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 1,35,27,717కి చేరింది. ఫలితంగా అమెరికా తరవాత వైరస్‌ కల్లోలానికి తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానానికి చేరింది. 

వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. మొత్తం కేసులపరంగా చూస్తే అమెరికాలో 3,19,18,591 మందికి కరోనా సోకింది. భారత్‌లో ఆ సంఖ్య కోటీ 35లక్షల మార్కును దాటగా.. బ్రెజిల్ తరవాత స్థానంలో ఉంది. ఆ దేశంలో 1,34,82,543 మంది మహమ్మారి బారినపడ్డారు. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్‌లో కూడా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అలాగే అమెరికాలో 5,75,829, బ్రెజిల్‌లో 3,53,293, మెక్సికోలో 2,09,212 మంది మరణించారు. కేసుల పరంగా భారత్ రెండో స్థానంలో ఉండగా.. మృతులసంఖ్య పరంగా నాలుగో స్థానం(1.70లక్షలు)లో ఉంది. ప్రస్తుతం కేసులతో పాటే మరణాల సంఖ్యలో కూడా వృద్ధి కనిపిస్తుండటం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా 904 మంది చనిపోయారు. ఈ క్రమంలో కొవిడ్ బాధితులతో వైద్య వ్యవస్థ కుప్పకూలకుండా చూసేందుకు మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌పై యోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే పలు రాష్ట్రాలు రాత్రికర్ఫ్యూ, కంటైన్మెంట్‌ జోన్ల ఏర్పాటుపై దృష్టిసారించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని