పాక్‌ శాంతిని కోరుకునే దేశమట!

భారత్‌తో సంబంధాలపై పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా కీలక వ్యాఖ్యలు చేశారు. దశబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్‌ వివాదాన్ని ఇరు దేశాలు హుందాగా, శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.......

Published : 04 Feb 2021 01:57 IST

ఇస్లామాబాద్‌ : భారత్‌తో సంబంధాలపై పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా కీలక వ్యాఖ్యలు చేశారు. దశబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్‌ వివాదాన్ని ఇరు దేశాలు హుందాగా, శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అలాగే పాకిస్థాన్‌ శాంతిని కోరుకునే దేశమని.. పొరుగువారితో కలిసుండాలని ఆకాంక్షిస్తుందని చెప్పుకొచ్చారు. అన్ని దిశల్లో శాంతిని పంచాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఖైబర్‌ రాష్ట్రంలోని ‘పాకిస్థాన్ వాయుసేన అకాడమీ’లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా భారత్‌ విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించే జావెద్‌ బజ్వా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పుల్వామాలో ఉగ్రవాదుల దుశ్చర్యకు ప్రతీకారంగా బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరంపై భారత వాయుసేన జరిపిన దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో బజ్వా శాంతి వచనాలు వల్లెవేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బజ్వా వ్యాఖ్యలు మారుతున్న పాక్ వైఖరిని ప్రతిబింబిస్తోందని కొంతమంది విదేశాంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల్ని పునరుద్ధరించుకునేందుకు పాక్‌ ఆసక్తిగా ఉన్నట్లు అర్థమవుతోందన్నారు.

దీనిపై భారతవైపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. అయితే, బజ్వా వ్యాఖ్యల్ని స్వాగతించడం తొందరపాటు అవుతుందని సైన్యంలోని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. పాక్‌ నిజంగా శాంతినే కోరుకుంటే దాన్ని చేతల్లో చూపించాలని హితవు పలికారు. ఉగ్రవాదం.. చర్చలు.. సమాంతరంగా ముందుకు సాగవని తేల్చి చెప్పారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పుల్వామా దాడిలో పాకిస్థాన్ ఉగ్రవాదుల పాత్ర ఉన్నట్లు నిరూపించే కీలక ఆధారాలను భారత్‌ ఇప్పటికే అక్కడి ప్రభుత్వానికి అందించింది. ఇప్పటి వరకు వారిపై పాక్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతకుముందు ముంబయి పేలుళ్ల ఘటనకు కారణమైనవారిపైనా కంటితుడుపు చర్యలకే పరిమితమైంది.

ఇవీ చదవండి...

ఆ భయంతోనే తిరుగుబాటు?

నావల్నీకి జైలు శిక్ష.. భగ్గుమన్న రష్యా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని