India Population: తగ్గుతున్న భారత జనాభా.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే!

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా గల దేశంగా పేరొందిన మన దేశంలో గత కొన్నేళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోందట. దశాబ్దాల కాలంగా కుటుంబ నియంత్రణపై కేంద్రం

Published : 26 Nov 2021 02:00 IST

దిల్లీ: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా గల దేశంగా పేరొందిన భారత్‌లో గత కొన్నేళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోందట. ఈ మేరకు నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-5 తాజా గణాంకాలు వెల్లడించాయి. 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప స్థాయి ఇది. అంతేగాక, తొలిసారిగా సంతానోత్పత్తి రేటు (TFR).. రీప్లేస్‌మెంట్‌ రేటు కంటే దిగువకు పడిపోవడం ఓ మైలురాయి అని సర్వే చెబుతోంది.

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ ఐదో ఎడిషన్‌ సర్వేను 2019-21 మధ్య నిర్వహించారు. ఆ వివరాలను రెండు విడతలుగా విడుదల చేశారు. తొలివిడత గణాంకాలను గతేడాది డిసెంబరులో బయటపెట్టగా.. రెండో విడత వివరాలను బుధవారం వెల్లడించారు. దీని ప్రకారం.. దేశంలో సంతానోత్పత్తి రేటు 2గా ఉంది. అంటే 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు సర్వే పేర్కొంది. అంతకు ముందు 2015-16లో నిర్వహించిన నాలుగో ఎడిషన్‌ సర్వేలో సంతానోత్పత్తి రేటు 2.2 శాతంగా ఉండగా.. ఇప్పుడు మరింత తగ్గింది. 

ఇక రీప్లేస్‌మెంట్ రేటు (సాధారణ స్థాయి భర్తీ రేటు) 2.1 కంటే సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. రీప్లేస్‌మెంట్‌ రేటు అంటే జనాభాలో ఎటువంటి తగ్గుదల, పెరుగుదల ఉండకపోవడం. దేశంలో జనన, మరణాలను బ్యాలెన్స్‌ చేసే స్థాయిగా దీన్ని పేర్కొంటారు. ఇప్పుడు మన దేశంలో సంతానోత్పత్తి రేటు అంతకంటే తక్కువగా ఉండటంతో జనాభా తగ్గుదల మొదలైందని సర్వే చెబుతోంది. 1998-99లో సంతానోత్పత్తి రేటు 3.2గా ఉంది. అంటే అప్పట్లో సగటు భారతీయ మహిళ తన జీవితకాలంలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు. ఆ తర్వాత క్రమంగా ఇది తగ్గుతూ వస్తోంది. 

ఐదు రాష్ట్రాల్లో.. ఎక్కువగానే..

2019-21లో ఐదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల సంతానోత్పత్తి రేటు 2 అంతకంటే తక్కువగానే ఉంది. బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపూర్‌లలో మాత్రం ఇది ఇంకా రీప్లేస్‌మెంట్‌ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు 2.4గా ఉండగా.. బిహార్‌లో 3గా తేలింది. దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు సిక్కింలో నమోదైంది. అక్కడ టీఎఫ్‌ఆర్‌ రేటు 1.1గా ఉంది. ఇక లద్దాఖ్‌లో సంతానోత్పత్తి రేటు ఐదేళ్లలో గణనీయంగా తగ్గి 2.3 నుంచి 1.3కు పడిపోయింది. అండమాన్‌ నికోబార్‌, గోవాల్లోనూ బర్త్‌ రేటు 1.3గా ఉంది. 

ప్రతి నలుగురిలో ఒకరికి బాల్య వివాహం..

ఇక దేశంలో బాల్యవివాహాలు గతంలో కంటే తగ్గినప్పటికీ ఇంకా ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరికి ఇంకా 18 ఏళ్లు నిండకుండానే వివాహం జరుగుతోందని సర్వే గుర్తించింది. 18ఏళ్లు నిండకుండానే వివాహం చేసుకునే వారి సంఖ్య ఐదేళ్ల క్రితం 26.6శాతంగా ఉండగా.. 2019-21లో 23.3శాతానికి తగ్గింది. ఇక కుటుంబ నియంత్రణ సాధనాలు వాడే వారి సంఖ్య కూడా 54శాతం నుంచి 67శాతానికి పెరిగినట్లు సర్వే వెల్లడించింది. అయితే, ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకపోవడం గమనార్హం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని