India Corona : 1.60 లక్షల కొత్త కేసులు.. 10 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1.60 లక్షల కొత్త కేసులు వెలుగులోకి రావడం వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది.

Updated : 09 Jan 2022 11:15 IST

దిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1.60 లక్షల కొత్త కేసులు వెలుగులోకి రావడం వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది. ఇక పాజిటివిటీ రేటు 10.21 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. మరోమైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

శనివారం 15,63,566 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  1,59,632 కొత్త కేసులు నమోదయ్యాయి.

⇒ ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరగ్గా.. వీక్లీ పాజిటివిటీ రేటు 6.77 శాతం వద్ద కొనసాగుతోంది.

గడిచిన 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 327 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 4,83,790కి చేరింది.

కొత్త కేసుల కారణంగా క్రియాశీల కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదవుతోంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5.9 లక్షలకు చేరి.. ఆ రేటు 1.66 శాతానికి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో 40,863 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.44 కోట్లు దాటింది.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న 89,28,316 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 151 కోట్లు దాటింది. రెండు కోట్లకుపైగా టీనేజర్లు టీకా తీసుకున్నారు.

దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3,623కు చేరింది. మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య వెయ్యి దాటి తొలి స్థానంలో ఉండగా.. దిల్లీ 513, కర్ణాటక 441, రాజస్థాన్‌ 373 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ వేరియంట్‌ నుంచి ఇప్పటికే 1,409 మంది కోలుకున్నారు.

ఒకరి నుంచి నలుగురికి కరోనా వ్యాప్తి..

దేశంలో ప్రస్తుతం ఒకరి నుంచి నలుగురికి కరోనా సోకుతున్నట్టు ఐఐటీ-మద్రాస్‌ పరిశోధకులు వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రతను అంచనా వేసేందుకు వారు ఆర్‌-నాట్‌ (ఆర్‌జీరో) విలువను లెక్కించగా, 4గా నమోదైంది. తాజా డేటా ప్రకారం- ఫిబ్రవరి 1-15 తేదీల మధ్య దేశంలో అత్యంత ఉద్ధృతంగా కేసులు నమోదవుతాయని భావిస్తున్నట్టు గణిత విభాగ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.జయంత్‌ ఝా పేర్కొన్నారు. ప్రజలు గుమిగూడకుండా కట్టడి చర్యలను కఠినతరం చేయడం, క్వారంటైన్‌ను పక్కాగా అమలుచేస్తే ఆర్‌-నాట్‌ విలువ తగ్గే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్‌-నాట్‌ విలువ 2.69గా ఉన్నట్టు గతవారం లెక్కగట్టింది. రెండో దశ ఉద్ధృతిలో ఈ విలువ గరిష్ఠంగా 1.69గా నమోదైనట్టు తెలిపింది. కాగా- డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ ప్రభావం 90-95% తక్కువగానే ఉంటోందని అమెరికాకు చెందిన ‘హెల్త్‌ మెట్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌’ డైరెక్టర్‌ డాక్టర్‌ క్రిస్టఫర్‌ ముర్రే అంచనా వేశారు. అయితే, భారత్‌లో ఈ వేరియంట్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున ఫిబ్రవరిలో రోజూ 5 లక్షల కేసులు నమోదయ్యే పరిస్థితి ఉండొచ్చన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని