India: శాంతికి భంగం కలిగిస్తే.. దీటుగా స్పందిస్తాం!

భారత్‌ శాంతిని కోరుకునే దేశం అయినప్పటికీ.. ఎవరైనా శాంతికి భంగం కలిగిస్తూ దూకుడుగా వ్యవహరిస్తే.. వారికి దీటుగా సమాధానం చెప్పే సామర్థ్యం ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ స్పష్టం చేశారు.

Updated : 18 Jun 2021 11:43 IST

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

దిల్లీ: భారత్‌ శాంతిని కోరుకునే దేశం అయినప్పటికీ.. ఎవరైనా శాంతికి భంగం కలిగిస్తూ దూకుడుగా వ్యవహరిస్తే.. వారికి దీటుగా సమాధానం చెప్పే సామర్థ్యం ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ స్పష్టం చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ హరిహద్దులో నిర్మించిన వ్యూహాత్మక రోడ్లను జాతికి అంకితం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనాకు పరోక్ష హెచ్చరికలు చేశారు.

‘భారత్ ప్రపంచ శాంతిని కోరుకునే దేశం. ఒకవేళ సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతతకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే.. దీటుగా ప్రతిస్పందించే సామర్థ్యం భారత్‌కు ఉంది’ అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (BRO) నిర్మించిన 12 వ్యూహాత్మక రహదారులను ప్రారంభించిన ఆయన.. అంతర్జాతీయ సరిహద్దులను రక్షించుకోవడంలో ఈ రహదారులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా గతేడాది గల్వాన్‌ లోయలో సైనికులు చూపిన ధైర్య సాహసాలు ఎనలేనివని కొనియాడారు. దేశం కోసం పోరాడుతూ ఆ ఘటనలో అమరులైన సైనికులకు వందనాలు చేస్తున్నానన్నారు.

ఇదిలాఉంటే, తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైన్యాల మధ్య జరిగిన పెను ఘర్షణకు ఏడాది పూర్తైంది. ఆ ఘటన జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. భారీగా బలగాలు, ఆయుధాలను సరిహద్దుల్లోకి తరలించాయి. ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, సైనికాధికారుల సంప్రదింపుల అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి తీసుకున్నాయి. పలు దఫాల్లో జరిగిన చర్చల్లో భాగంగా సరిహద్దులో యాథాతథ స్థితిని కొనసాగించాలని ఇరుదేశాలు అంగీకారానికి వచ్చినప్పటికీ.. చైనా బలగాలు మాత్రం పలుచోట్ల కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని