R-Value : 4కు చేరిన‘ఆర్‌నాట్‌’విలువ.. ఫిబ్రవరి 1-15 మధ్య గరిష్ఠ స్థాయికి కేసులు

దేశంలో కొన్ని రోజులుగా భారీ ఎత్తున కొవిడ్‌ కేసులు నమోదవుతుండటంతో.. మూడో వేవ్‌ మొదలైనట్లేనని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత రెండు వారాల కొవిడ్‌ కేసులను విశ్లేషించిన ఐఐటీ మద్రాస్‌ బృందం.. తాజాగా కీలక విషయాలు...

Updated : 08 Jan 2022 15:19 IST

ఐఐటీ మద్రాస్‌ ప్రాథమిక విశ్లేషణలో వెల్లడి

చెన్నై: దేశంలో కొన్ని రోజులుగా భారీ ఎత్తున కొవిడ్‌ కేసులు నమోదవుతుండటంతో.. మూడో వేవ్‌ మొదలైనట్లేనని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత రెండు వారాల కొవిడ్‌ కేసులను విశ్లేషించిన ఐఐటీ మద్రాస్‌ బృందం.. తాజాగా కీలక విషయాలు వెల్లడించింది. కంప్యూటేషనల్ మోడలింగ్ ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా.. దేశంలో ‘ఆర్‌నాట్‌’ విలువ డిసెంబర్ 25- 31 మధ్య 2.9 ఉండగా.. జనవరి 1-6 మధ్య ఏకంగా 4గా నమోదైందని తెలిపింది. దేశంలో మహమ్మారి రెండో వేవ్ పీక్‌ దశలో నమోదైన 1.69 కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ‘ఆర్‌నాట్‌’గా పేర్కొంటారు. ఈ విలువ ఒకటి దాటడం ఏమాత్రం సానుకూల పరిణామం కాదని నిపుణులు చెబుతుంటారు. గత బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ సైతం దేశ ఆర్‌నాట్ విలువ 2.69గా ఉందని తెలిపింది.

మరోవైపు దేశంలో ప్రస్తుత వేవ్‌.. ఫిబ్రవరి 1-15 మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఈ బృందం అంచనా వేసింది. ఐఐటీ మద్రాస్‌ గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జయంత్ ఝా ఈ విషయమై మాట్లాడుతూ.. ఆర్‌నాట్ అనేది సంక్రమణ సంభావ్యత, కాంటాక్ట్‌ రేటు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే.. క్వారంటైన్‌ నిబంధనలు, ఆంక్షల విధింపు కారణంగా కాంటాక్ట్ రేట్ తగ్గి, ఆర్‌నాట్‌ విలువా పడిపోవచ్చన్నారు. ఆర్‌నాట్‌ విలువ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన దానికంటే భిన్నంగా ఉండటంపై వివరణ ఇస్తూ.. ఈ రెండు అంచనాలు వేర్వేరు టైం ఇంటర్వెల్‌పై ఆధారపడి ఉన్నాయని, తాము కేవలం గత రెండు వారాలకు సంబంధించిన వివరాలపై ప్రాథమిక విశ్లేషణ చేసినట్లు చెప్పారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ రేటు, మొదటి రెండు వేవ్‌లతో పోల్చితే ఈసారి తక్కువ సామాజిక దూరం పాటిస్తుండటం వంటి కారణాలతో.. ప్రస్తుత వేవ్‌ మునుపటివాటి కంటే భిన్నంగా ఉంటుందని ఝా వెల్లడించారు. ఈసారి జనాభాలో దాదాపు 50 శాతం మందికి టీకాలు పూర్తికావడం కూడా కలిసొచ్చే అంశమని చెప్పారు.

మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చింది. వరుసగా రెండో రోజూ కొత్త కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21 శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 3 వేల పైనే ఉన్నాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. నిన్న 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 1,41,986 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతానికి పెరిగి ఆందోళన కలిగిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని