GII 2022: జీఐఐ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 40వ స్థానం

‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌- 2022(GII- 2022)’ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 40వ స్థానం సాధించింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO) గురువారం తన వార్షిక నివేదికను విడుదల చేసింది. స్విట్జర్లాండ్‌....

Published : 30 Sep 2022 00:38 IST

దిల్లీ: ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌- 2022(GII- 2022)’ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 40వ స్థానం సాధించింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(WIPO) గురువారం తన వార్షిక నివేదికను విడుదల చేసింది. స్విట్జర్లాండ్‌, అమెరికా, స్వీడన్‌, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌లు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత్‌ గతేడాది 46వ స్థానంలో నిలవగా, మంచి పురోగతి సాధించి ఈసారి ఏకంగా ఆరు స్థానాలు మెరుగుపర్చుకోవడం విశేషం. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్‌.. ఏడేళ్లలోనే 41 స్థానాలు ఎగబాకి, టాప్‌-40లో చోటుదక్కించుకుంది. రాజకీయ వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, పరిశోధన, మానవ మూలధనం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా ఈ ర్యాంకులు కేటాయిస్తారు.

‘దిగువ మధ్య ఆదాయ దేశాల్లో భారత్ ‘ఇన్నోవేషన్ లీడర్‌’గా దూసుకెళ్తోంది. ఇన్ఫర్మేషన్‌, కంప్యూటర్‌ టెక్నాలజీ(ఐసీటీ) సేవల ఎగుమతుల్లో ప్రపంచంలో అగ్రగామిగా కొనసాగుతోంది. స్టార్టప్‌, స్కేలప్‌ల ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌లు, కార్మిక ఉత్పాదకత పెరుగుదల, దేశీయ పరిశ్రమల వైవిధ్యం సహా ఇతర సూచికల్లో ఉత్తమ స్థానంలో నిలిచింది’ అని డబ్ల్యూఐపీఓ తన నివేదికలో పేర్కొంది. అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థలు బలమైన పనితీరును కనబరుస్తున్నాయని తెలిపింది. కరోనా పరిస్థితుల్లోనూ.. 2021లో ఆవిష్కరణలకు భారీగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించింది. అయితే, 2022లో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, ఆవిష్కరణల ఆధారిత ఉత్పాదకతలో బలహీనమైన పనితీరుతో.. పెట్టుబడులు తగ్గినట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని